పండుగ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ బాలిక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
గజపతినగరం(విజయనగరం): పండుగ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ బాలిక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విజయనగరం జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గజపతినగరం మండల కేంద్రానికి చెందిన షేక్ చాంద్‌బాషా, నసీమా దంపతుల కూతురు బషీరున్నీసా(12) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
సెలవులు రావటంతో మూడు రోజుల క్రితం అమ్మమ్మ గారి ఊరైన దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామం వెళ్లింది. బుధవారం సాయంత్రం మేనమామతో కలసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరింది. గ్రామ సమీపంలో ఆ ఆటో బోల్తా పడి బషీరున్నీసా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడింది.