టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును హతమారుస్తామంటూ ఈ నెల 6న ఫోన్ ద్వారా హెచ్చరించిన యువకుడ్ని ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును హతమారుస్తామంటూ ఈ నెల 6న ఫోన్ ద్వారా హెచ్చరించిన యువకుడ్ని ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులో తన పెద్దమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతున్న యువకుని(మైనర్) స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి పట్టణం. ఈ నెల 6న తన మొబైల్ నుంచి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవరావుకు ఫోన్‌చేసి కేసీఆర్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. కేసీఆర్‌ను చంపుతామంటూ ఈ నెల 12న లేఖ కూడా రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా యువకుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
ఆవేశంలోనే కేసీఆర్‌కు లేఖ రాశాడు
కావలి, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం ఆవేశపడే తమ కుమారుడు కేసీఆర్‌కు బెదిరింపు లేఖ పంపాడని, దీంతో కష్టాలు ఎదుర్కోవలసి వస్తోందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడైన తమ కుమారుడు అలా ప్రవర్తించడం.. పోలీసులు అరెస్టు చేయడంతో వారు కుంగిపోతున్నారు. ఉద్యమంలో పోరాడుతున్న వారు బాసటగా నిలిచి తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయపడాలని కోరుతున్నారు.