బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో పేదలకు ఇళ్లు
హైదరాబాద్: హైదరాబాద్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీలైతే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, క్లబ్లకు పదుల ఎకరాల స్థలం ఉందని వివరించారు. వాటిలో చాలా భాగం నిరుపయోగంగా ఉందని, ఈ స్థలాలను పేదల గృహనిర్మాణాలకు ఉపయోగిస్తామని కేసీఆర్ చెప్పారు. నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టించేందుకు విలువైన స్థలాలు ఉపయోగిస్తే తప్పులేదని అన్నారు. బుధవారం కేసీఆర్ హైదరాబాద్లోని పేదల గృహ నిర్మాణాలపై కూడా సమీక్ష నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా హైదరాబాద్లో ఇళ్లు లేని పేదలు 2 లక్షలమంది ఉన్నారని తేలిందని కేసీఆర్ అన్నారు. పేదలందరికీ ప్రభుత్వం తరపున ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
వచ్చే ఏడాదికల్లా తెలంగాణలో నిరంతర విద్యుత్: వచ్చే ఏడాది నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్ ఈ రోజు విద్యుత్ సరఫరా తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది రెండో పంటకు పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లగొండలో నిర్మించనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. దీనికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్గా పేరును ఖరారు చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.