‘నారాయణ’పై గరం గరం | Students protest exhibitions | Sakshi
Sakshi News home page

‘నారాయణ’పై గరం గరం

Published Thu, Aug 20 2015 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

‘నారాయణ’పై గరం గరం

‘నారాయణ’పై గరం గరం

జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు
ఒంగోలు టౌన్ :
నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి పి.నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు. గడిచిన 15 నెలల్లో నారాయణ కళాశాలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ మీదుగా నారాయణ దిష్టిబొమ్మతో ప్రదర్శనగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంగా ఏర్పడి అరగంటపాటు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.  ముందుగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్, నగర కార్యదర్శి పి.రాంబాబు, ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ.. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ధ్వజమెత్తారు.

లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేకే కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
పీడీఎస్‌యూ ఆధర్యంలో దిష్టిబొమ్మ దహనం
కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణ విద్యా సంస్థల దిష్టిబొమ్మ ద హనం చేశారు. గుర్తింపులేని నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని, నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు జీవన్, తరుణ్, పీవైఎల్ నాయకుడు నాగరాజు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో..   
ఒంగోలు : కడప నారాయణలో విద్యార్థినుల మృతిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవార ం బంద్ నిర్వహించారు. స్థానిక మంగమూరు డొంకలోని ఓ ప్రైవేట్ కళాశాల సిబ్బందికి, ఏబీవీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కళాశాలకు సెలవు ప్రకటించడంతో ఏబీవీపీ విద్యార్థులు వెనుదిరిగారు. ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ.. కడపలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెప్పడం సిగ్గుచేటన్నారు. సెలవు దినాల్లో సైతం కాలేజీలు నిర్వహించడం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, రాజేష్, సుదీర్, మణి, అన్వేష్, నరసారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, హేమంత్, గణేష్, విజయ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement