
సాక్షి, విజయవాడ: ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుంచి 550 జీవో సక్రమంగా అమలు చేయకుండా, కౌన్సిలింగ్‌లో అవకతవకలకు పాల్పడి సుప్రీం కోర్టు జడ్జిమెంటును వీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల్లో సైతం సరైన వివరాలను ఇవ్వలేదనీ, వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క రిజర్వేషన్ విద్యార్థికి అన్యాయం జరుగకుండా చూస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తల్లిదండ్రులు స్పందిస్తూ పిల్లల మానసిక క్షోభకు వీసీనే కారణమని, రిజర్వేషన్ ప్రకారం రీ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment