సమైక్య రన్ విజయవంతం
Published Mon, Feb 10 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఒలింపిక్, ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఐదు కిలోమీటర్ల సమైక్య పరుగు విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం స్థానిక అయోధ్యా మైదానం వద్ద ప్రారంభమైన ర్యాలీని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, ఏన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభూజీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గంటా వెంకటరావు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ర్యాలీ బాలాజీ జంక్షన్, ట్యాంక్‌బండ్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి జంక్షన్, ఎత్తు బ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ జంక్షన్ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు సాగింది.
ఈ ర్యాలీలో పలువురు విద్యార్థులు 15 అడుగుల జాతీయ జెండాతో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రన్‌లో పాల్గొన్నవారందరికీ నిర్వాహకులు జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన టీ షర్టులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, తదితరులు ర్యాలీ బాలాజీ జంక్షన్ చేరుకున్న అనంతరం వెనుదిరగడంపై సమైక్యవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వెనకడుగు వేయం..
భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి ఉద్యమానికైన వెనుకాడేది లేదని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, ఏన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభూజీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గంటా వెంకటరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒకేసారి సాయంత్రం నాలుగు గంట లకు సమైక్య రన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కొందరి స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒలింపి క్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటరావు, శ్రీనివాసరావు, అప్పారావు, పీవీ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement