=భారత్‌కు రావాలని 40 మంది ఎదురుచూపు
= కుటుంబ సభ్యుల్లో ఆందోళన
= ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి
పెనమలూరు, న్యూస్‌లైన్ : సుడాన్ దేశంలో జరుగుతున్న అంతర్గత పోరు కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన ఓ యువ ఇంజినీర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అతనితోపాటు భారతదేశానికి చెందిన 40 మంది పరిస్థితి కూడా అలాగే ఉంది.
ప్రభుత్వం వెంటనే స్పందించి సుడాన్‌లో ఉన్న వారిని సురక్షితంగా భారతదేశానికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోరంకి గ్రామానికి చెందిన నల్లమోతు మురళీ కుమారుడు నల్లమోతు కిరణ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి గత ఏడాది దక్షిణ సుడాన్‌లోని పలోజాలో ఉన్న స్టార్ కాంట్రాక్టింగ్ ఆయిల్ ఆండ్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అతను గత మార్చి నెలలో భారత్‌కు వచ్చి జూన్‌లో తిరిగి సూడన్‌కు వెళ్లారు.
ఆ దేశంలో అంతర్గత యుద్ధం సందర్భంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుడాన్ రాజధాని జుబ్బాకు 400 కిలోమీటర్ల దూరంలో పలోజాలో కిరణ్ పని చేస్తున్నారు. అక్కడ మిలిటెంట్ పోరు జరగడంతో కిరణ్‌తోపాటు మరో 40 మంది భారతీయులు కంపెనీలోనే చిక్కుకుపోయారు. వారు భారత్‌కు రావటానికి అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు.
ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను మాత్రం ఆయా దేశాలు సురక్షితంగా తీసుకు వెళ్లాయి. అయితే భారత్‌కు చెందిన వారిని మాత్రం ఎవ్వరు పట్టించుకోవటంలేదని కిరణ్ స్వయంగా ఫోన్‌లో న్యూస్‌లైన్‌కు మంగళవారం తెలిపారు. తాము జుబ్బాకు చేరుకోగలిగితే భారత్‌కు రాగలుగుతామని తెలిపారు.
ప్రభుత్వం స్పందించాలి...
సుడాన్‌లో చిక్కుకుపోయిన తమ కుమారుడు, మరో 40 మందిని ప్రభుత్వం భారత్‌కు తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కిరణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సుడాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున తక్షణం ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న వారిని ఇక్కడకు సురక్షితంగా తీసుకువావాలని కోరుతున్నారు.
సుడాన్‌లో పోరంకి ఇంజినీర్ పాట్లు
Published Wed, Dec 25 2013 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement