
నేను పుట్టకముందే మా ఇంట్లో పాట పుట్టింది
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
పిఠాపురం టౌన్ : తాను పుట్టక ముందే తన ఇంట్లో పాట పుట్టిందని ప్రముఖ గేయ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ఆదిత్య స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన బుధవారం సాయంత్రం విలేకర్లతో ముచ్చటించారు. పాట అనేది తన ఇంట్లో పుట్టిన ఆడపడచులాంటిదన్నారు.
నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే తాను గేయాన్ని రచించినట్టు తెలిపారు. తన తల్లిదండ్రులు జానకమ్మ, హనుమంతులు స్వాతంత్ర సమరయోధులన్నారు. తండ్రి మంచి గేయ రచయిత అన్నారు. ప్రముఖ కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ భావాల కలయికతో తాను గేయ రచయితగా ఎదిగానని సుద్దాల తెలిపారు. మానవ సంబంధాలు, అభ్యుదయ భావాలు, అమ్మదనంతో కలకలిపిన పాటలంటే ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు. తన పాటల్లో వీటికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.
తనకు తానే పోటీగా పాట రచన చేస్తున్నట్టు తెలిపారు. తనకు మొదటి గురువు తండ్రి హనుమంతప్ప కాగా, అనంతరం సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిల అడుగుజాడల్లో నడిచినట్టు వివరించారు. పాండురంగడు సినిమాలో అమ్మనాన్నల మీద తాను రాసిన పాట తనకిష్టమైనదని అన్నారు. అన్ని సాహిత్యాలకూ జానపదం తల్లివంటిదన్నారు. ఠాగూర్ సినిమాకు తనకు జాతీయ అవార్డు వచ్చిందని, శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్నది తానేనని అశోక్‌తేజ తెలిపారు.