హాస్టల్ విద్యార్థిని ఆకస్మిక మృతి
అనారోగ్యమే కారణమని అధికారుల వెల్లడి
కశింకోట: స్థానిక సమగ్ర సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం బాలిక మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. అనారోగ్యంమే కారణమని అధికారులు తెలిపారు. మాకవరపాలెం మండలం అప్పన్నదొరపాలెం గ్రామానికి చెందిన అడిగర్ల గౌతమి (11) ఇక్కడి వసతి గృహంలో ఉంటూ స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించారు.
మంగళవారం కూడా ఉబ్బసంతో బాధపడుతూ ఆయాసంతో పాటు వాంతులు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జె.ప్రశాంతి పరీక్షించి పరిస్థితి బాగోగపోవడంతో అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ గౌతమి మృతి చెందినట్లు వసతిగృహం సంక్షేమ అధికారి శ్యామల, పీహెచ్‌సీ వైద్యాధికారి జె.ప్రశాంతి తెలిపారు. ఆ బాలికకు ఉబ్బసంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని, విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఇప్పటికే వైద్యం పొందుతోందని చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేయకుండా వసతిగృహం తెరిచినప్పుడు ఈ నెల 17న వచ్చి చేరినట్లు తెలిపారు. తమ కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేదని, విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారని అనకాపల్లి అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ అధికారి పి.వి.ఎస్.ఎస్.జయలక్ష్మి తెలిపారు. గౌతమి గత ఏడాది ఆరో తరగతిలో ఇక్కడ చేరిందన్నారు.
రోజూ తమతోపాటు ఉండే గౌతమి ఆకస్మాత్తుగా మృతి చెందడం విద్యార్థులను కలచివేసింది. ఆ బాలిక మృతికి సంతాపంగా మౌనం పాటించి బాలికల హైస్కూలుకు సెలవు ప్రకటించారు. మతదేహాన్ని అనకాపల్లి ఆస్పత్రి నుంచి స్వస్థలానికి తీసుకెళ్లారు. ఎంఈఒ ఎం.ఎస్. స్వర్ణకుమారి పాఠశాలను పరిశీలించి గౌతమి మృతి గురించి వివరాలు తెలుసుకున్నారు.