అయ్యో.. సుమతీ!
యువతిపై మృత్యుక్రీడ
ప్రాణాలు తోడేస్తున్న హైపర్ ప్లాస్టిక్ బోన్‌మారో
బతుకు మీద ఆశతో రోజులు లెక్కిస్తున్న నిరుపేద
దాతలు కరుణిస్తే ప్రాణాలు నిలబడతాయి
ఆపన్నహస్తం కోసం అశ్రునయనాలతో ఎదురుచూపు
‘అంతే లే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు’.. అన్నారు మహాకవి శ్రీశ్రీ. గుండెలే కాదు పేదల జీవితాలే కన్నీటి కండలవుతున్నాయి. దీనికి ఆ విద్యాధిక కుటుంబమే నిదర్శనం. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేశమాత్రమైనా లేని ఆ కుటుంబంపై విధి కూడా వక్రదృష్టి సారించింది. అంతే.. అంతవరకు సలక్షణంగా ఉన్న.. డిగ్రీ పూర్తి చేసిన ఆ కు టుంబంలోని యువతిని అతి భయంకరమైన వ్యాధి ఆవహించి ంది. వైద్య చికిత్స ఖరీదు కావడంతో లక్షల రూపాయల భారాన్ని నిరుపేద కుటుంబం నెత్తిన మోపింది. పెళ్లీడుకొచ్చిన కూతురు మంచం పట్టింది. వైద్యం చేయించే తాహతు లేక ఆ అమాయకురాలితోపాటు కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోతోంది.
పొందూరు:కొద్ది నెలల క్రితం వరకు ఆ అమ్మారుు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. ఉత్సాహంగా తిరుగుతూ ఇల్లంతా సందడి చేసేది. అంతలోనే అస్వస్థతకు గురైంది. సాధారణమే కదా.. అనుకుంటే.. పరిస్థితి కాస్త తిరగబడింది. తల్లిదండ్రులు మొదట స్థానిక వైద్యులకు, ఆ తర్వాత శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లి చూపించారు. ఫలితం లేకపోయింది. విశాఖ కేజీహెచ్‌లో చూపించారు. పరీక్షల్లో అప్పటికే ఆమె రక్తంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్య 1.50 లక్షల నుంచి ఏడువేల కనీస స్థాయికి పడిపోయాయి. శారీరకంగా కృశించిపోయింది. అన్ని రకాల పరీక్షల అనంతరం కేజీహెచ్ వైద్యులు బాంబు పేల్చారు. ఆమె అరుదైన హైపర్ ప్లాస్టిక్ బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లినా అక్కడి వైద్య నిపుణులు కూడా అదే చెప్పారు. చికిత్సకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చువుతుందని కూడా స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యూరు. చేసేదేమీ లేక కుమార్తెను తీసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
పేదరాలికి ఖరీదైన వ్యాధి
పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన వండాన రామారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహమైనా ఆమె వైవాహిక జీవితం సక్రమంగా సాగడం లేదు. కుమారుడు వెంకటేష్ ఇటీవలే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మరో కుమార్తె అయిన సుమలత గత ఏడాదే బీకాం(కంప్యూటర్స్) పూర్తి చేసింది. ఎంఏ, బీఈడీ చేసిన రామారావు ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నారు. గతంలో శ్రీకాకుళంలోని పలు ప్రైవేటు కళాశాలల్లోనూ, నందిగాం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా దినం తీరడం లేదు. పైసా ఆదాయం లేదు. సెంటు భూమి లేదు. బతకడమే కష్టంగా ఉన్న రామారావును కుమార్తె దీనస్థితి మరింతంగా కుంగదీస్తోంది.
బతుకు ఆశతో..
కుమార్తెను బతికించుకునేందుకు శ్రీకాకుళం రిమ్స్ నుంచి హైదరాబాద్ నిమ్స్ వరకు ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే చికిత్సకు తమిళనాడులోని వేలూరుకు తీసుకెళ్లాలని, ఖర్చు రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలియడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఇంటి వద్దనే మంచంపై ఉన్న కూతురిని చూసుకొని గుడ్లనీరు కక్కుకుంటున్నారు. ఏదైనా మార్గం కనబడకపోతుందా?.. కూతురి జీవితం మళ్లీ చిగురించకపోతుందా??.. అన్న ఆశతో రోజులు గడుపుతున్నారు. బాధాసర్ప దష్టురాలైన సుమలతకు మెరుగైన వైద్య చికిత్సకు సహకరించి కొత్త జీవితం ఇవ్వాలని తల్లిదండ్రులు అశ్రునయనాలతో వేడుకుంటున్నారు. స్పందించే హృదయం ఉన్న వ్యక్తులు, సంస్థలు సెల్: 8008545015కు సంప్రదించాలని, తమ స్టేట్ బ్యాంకు ఖాతా నంబర్ 11639435720 అని వివరించారు.