వేసవి శిక్షణ శిబిరాలపై నీలినీడలు
శ్రీకాకళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్, జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 1 నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభం కావా ల్సి ఉన్నా.. ఇప్పటివరకు ప్రణాళిక కూడా సిద్ధం కాకపోవటం క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు ఆందోళన కలిగిస్తోంది.
శిక్షణ శిబి రాల ఫైలును సిద్ధం చేసి తనకు పంపాలని వారం రోజుల కిందట కోడి రామ్మూర్తి స్టేడియాన్ని సందర్శించిన కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదేశించినప్పటికీ క్రీడాధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. వారి తీరుపై క్రీడాకారులు మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి
ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. పాఠశాల తరగతుల చిన్నారులకు ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 24వ తేదీకల్లా పరీక్షల సందడి ముగుస్తుంది. దీంతో వేసవి సెలవుల్లో తమకిష్టమైన క్రీడాంశంలో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఇలాంటివారి కోసం ఏటా మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
వీటిలో 8 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది శాప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శిబిరాలు.. శ్రీకాకుళం, ఆమదాలవల స, ఇచ్ఛాపురం, పలాస, రాజాం మునిసిపాలిటీల్లో ఐదేసి చొప్పున శిబిరాలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
అయితే ఏయే కేంద్రాల్లో ఏయే క్రీడాం శాల్లో శిక్షణ ఇవ్వాలి? శిక్షకులుగా ఎవరెవరిని నియమించాలి? ఎంతమంది క్రీడాకారులు హాజరుకానున్నారు? అనే అంశాలపై అధికారులు ఇంతవరకు కసరత్తు చేయలేదని సమాచారం. మరోవైపు నిధులు లేవన్న సాకుతో శిబిరాల సంఖ్యను తగ్గించేందుకు వారు యత్నిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని క్రీడాంశాలపై శీతకన్ను
హాకీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, తైక్వాండో, ఆర్చరీ, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాల్లో మాత్రమే తర్ఫీదు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. చెస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాలను పక్కన పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే వీటితోపాటు క్రికెట్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్‌బ్యాడ్మింటన్, జూడో అంశాలలో సొంతంగా శిక్షణ ఇవ్వాలని ఆయా క్రీడాసంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి.