ఊపందుకున్న విమాన ప్రయాణాలు | Summer Tours From Visakhapatnam Airport | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న విమాన ప్రయాణాలు

Published Mon, May 28 2018 12:10 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

Summer Tours From Visakhapatnam Airport - Sakshi

విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ

వేసవి సెలవులకు ఎక్కడెక్కడికో టూర్లు వెళ్లే వారు కొందరైతే.. వచ్చే వారు మరి కొందరు.. ఆ ప్రయాణికులను ఆకర్షించడానికి విమాన సంస్థల మధ్య పోటీ.. తగ్గింపు ధరలకే ఆఫర్‌ల్లో ముందస్తు టికెట్‌లు.. అందులో టికెట్‌ దొరక్కపోయినా ఎక్కువైనా ఫరావాలేదు సుఖ మయ ప్రయాణమే బెస్టని ప్రయాణికులు ఎక్కువగా విమానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో కోలాహలంగా కనిపిస్తోంది. ఈ సర్వీసులకూ డిమాండ్‌ ఆకాశమంత ఎత్తున పెరిగిపోతోంది.

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 42 విమాన సర్వీసులు దేశీయ, అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై, తిరుపతి, పోర్ట్‌బ్లెయిర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఢిల్లీతో పాటు శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ పట్టణాలను సైతం చేరుకోడానికి ఎయిర్‌ కనెక్టివిటీ ఉండడంతో జనం ఇలా వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. 

టికెట్‌ ధరలకు రెక్కలు..
ప్రయాణాల డిమాండ్‌ను చూసి ప్రైవేటు బస్‌ ఏసీ సర్వీసులు విపరీతమైన గిరాకీ చూపుతున్నాయి. ఏసీ రైళ్లలో ప్రయాణాలకూ వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఈదశలో గంటలు, రోజుల ప్రయాణాలకు వేలు రూపాయలు వెచ్చించే కంటే గంటో, గంటన్నరలోనో హైదరాబాద్, బెంగళూరు తదితర పట్టణాలకు వెళ్లడం మంచిదన్న భావన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. ఇలా కొందరు వేసవికి ముందే రూ.999, రూ.2000 టికెట్‌ల ఆఫర్లు పొంది పిల్లాపాపలతో హాయిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆఫర్లలో టికెట్‌ దొరక్కపోయినా డబ్బుకు వెనకాడని ప్రయాణికులు మాత్రం విమాన ప్రయాణంకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విమానాలన్నీ ఫుల్‌గా నడుస్తున్నాయి.

ఒడిశా వారూ ఇక్కడి నుంచే..
ఒడిశా భువనేశ్వర్‌లో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు విశాఖ నుంచే అధికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒడిశా నుంచి ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాల కోసం బెంగళూరుకు వెళ్లే వారు ఎక్కవగా కనిపిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైల్లో సింహాచలం రైల్వేస్టేషన్‌కో, విశాఖ స్టేషన్‌కో వచ్చి విశాఖ విమానాశ్రయం నుంచి సర్వీసులు పట్టుకుంటున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల సమయం ఆదాతో పాటు ప్రయాణ ఖర్చుల భారం బాగా తగ్గుతున్నట్లు వారు చెబుతున్నారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి ఎక్కడికీ సర్వీసులు లేక పోవడంతో అక్కడి ప్రయాణికులూ విశాఖకు వచ్చి ప్రయాణాలు చేస్తున్నారు.ఇలా విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. మొత్తంమ్మీద ప్రయాణాల్లో మొదటి స్థానం హైదరాబాద్‌ కాగా తర్వాత బెంగళూరుకే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement