
అణగారిన వర్గాలకు అండ కాంగ్రెస్
► పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
చిత్తూరు (అగ్రికల్చర్): అణగారిన నిరుపేద వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్రలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. త్వరలోనే చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిస్సిగ్గుగా దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబు అవినీతి పాలనకు నిదర్శనమన్నారు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, సుబ్రమణ్యం, తుకారామ్, సంపత్, మొదలి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్రను ఆ పార్టీ నాయకులు ఘనంగా చేపట్టారు. స్థానిక పీసీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభించారు. అనంతరం బైక్‌ర్యాలీలో దర్గా సర్కిల్ వరకు వెళ్లి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బంగారుపాళెంలో...
బంగారుపాళెం: ప్రజలపై మోపిన విద్యుత్, బస్సు చార్జీల భారాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో భాగంగా బంగారుపాళెం మండలం బలిజపల్లె వద్ద ఆగారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు భోజనపాటి రవీంద్రనాయుడు మామిడి తోటలో మాట్లాడారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత 2 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందన్నారు. టీడీపీ ఎన్నికల హామీ 9 గంటల కరెంటు ఊసే లేదన్నారు. బొగ్గు కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడుతూ ప్రైవేటు వారికి కొమ్ముకాస్తున్నారన్నారు.
మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే పోరాటం
మదనపల్లె సిటీ : రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండులో బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం డబ్బులు పెట్టిన నారాయణకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాక పోయినా ఏకంగా మంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు.