పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విసృ్తతంగా ప్రచారం చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్లను గంపగుత్తగా తొలగించేస్తున్నారు అధికారులు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విసృ్తతంగా ప్రచారం చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్లను గంపగుత్తగా తొలగించేస్తున్నారు అధికారులు. జాబితా పరిశీలనలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ అసలు ఓటర్లకు ఎసరు పెడుతున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో భారీగా ఓటర్లపేర్లు గల్లంతయ్యాయి. మరణించిన వారిని జాబి తాలో ఉంచేసిన అధికారులు.. బతికున్న వారి పేర్లను పెద్దఎత్తున తొలగించారు. ఎల్‌బీనగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే తరహాలో వేలాది మంది పేర్లు తారుమారయ్యాయి.
నేటితో ముగియనున్న గడువు
ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల మార్పు, చేర్పులకు సంబంధించి సోమవారంతో గడువు ముగియనుంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగిస్తూ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో తుది జాబితా విడుదల చేయనుంది. ఈ జాబితా ఆధారంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఓటరు జాబితాపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితానుంచి గల్లంతు కాగా.. వాటిపై మొక్కుబడి చర్యలు తీసుకోవడం తప్పా పూర్తిస్థాయి కసరత్తును గాలికొదిలేశారు. కొన్ని రాజకీయ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ జాబితాను తారుమారు చేస్తున్నారు. నేటితో ఓటరు నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తే తుది జాబితాలో లోటుపాట్లు లేకుండా రూపొందించే అవకాశం ఉంది.