ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో చూసుకున్నారా? మీ ఓటరు కార్డులో ఏవైనా సవరణలుంటే సరిదిద్దుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారా? ఓటు హక్కు లేనివారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారా? ఇంకా ఎవరైనా ఈ దరఖాస్తులు చేయని పక్షంలో తొందరగా చేసుకోండి. ఇంకా మూడు రోజులే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ, చిరునామా, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు చేర్పులు, కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఈ నెల 25 వరకు గడువుంది. ఈ నేపథ్యంలో ఆయా దరఖాస్తులకు సంబంధించి సమగ్ర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి, సిటీబ్యూరో : వాస్తవానికి జనవరిలో ప్రకటించాల్సిన ఓటర్ల జాబితాను ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 8న ప్రకటించనున్నారు. దీంతో ఓటర్ జాబితాలోపొరపాట్ల సవరణ, చిరునామా, పోలింగ్ కేంద్రాల్లో మార్పులుచేర్పులకు...
2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా పేరు నమోదుచేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఆయా దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 25వరకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిజీహెచ్‌ఎంసీ వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. తీరా పోలింగ్ రోజు తమ ఓటు లేదని, వివరాలు తప్పులతడకగా ఉన్నాయని విమర్శిస్తుంటారు. చివరి క్షణంలో అలా చేసే బదులు ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. ఆలస్యమెందుకు.. త్వరపడండి మరి.
ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. తమ నియోజకవర్గం ఎంచుకొని పేరు, ఇంటి నెంబర్, చిరునామా తదితర ఎంటర్ చేయాలి. ఒకవేళ జాబితాలో పేరు లేనట్లయితే నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే లేదా ఓటరు నమోదు కేంద్రాల్లో(పోలింగ్ కేంద్రాల్లో) సంబంధిత ఫారం–6 పూర్తి చేసి అక్కడి అధికారులకు అందజేయాలి. పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటు హక్కు నమోదు కోసం ఫారం–6 పూర్తి చేసివ్వాలి. చిరునామాలో మార్పులకూ ఇదే ఫారమివ్వాలి.
⇔ హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,581 ఓటరు నమోదు కేంద్రాలున్నాయి. ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్ ద్వారా మీకు సమీపంలోని నమోదు కేంద్రాన్ని తెలుసుకోవచ్చు.
⇔ జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అవర్ సర్వీసెస్ మెనూ నుంచి ‘ఎలక్షన్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా జాబితాలోపేరున్నదో? లేదో? తెలుసుకోవచ్చు.
ధ్రువీకరణ పత్రాలు...
⇔ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా, నేరుగా దరఖాస్తు చేసుకున్నా పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణలకు ఈ కింది పత్రాలు అవసరం.
⇔ పుట్టిన తేదీ ధ్రువీకరణకు మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, ప్రభుత్వ పాఠశాల నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్, పుట్టిన తేదీతో కూడిన 8వ తరగతి లేదా పదో తరగతి మార్కుల మెమో, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్‌లలో ఏదో ఒకటి.
⇔ చిరునామా ధ్రువీకరణకు బ్యాంక్, కిసాన్, పోస్టాఫీస్, కరెంట్ పాస్‌బుక్, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్‌కంటాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్, తాజా రెంట్ అగ్రిమెంట్‌లలో ఏదో ఒకటి.
⇔ పైవేవీ లేనివారు వాటర్, టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ బిల్స్‌లో ఏదో ఒకటి జత చేయాలి. వీటిల్లో దరఖాస్తుదారు పేరు లేనివారికి కనీసం తల్లిదండ్రుల పేర్లుండాలి.
⇔ చిరునామా ధ్రువీకరణకు పోస్టల్ శాఖ ద్వారా అందిన ఉత్తరాన్ని కూడా వినియోగించొచ్చు.
నమోదు కేంద్రం గుర్తింపు ఇలా..
‘మైజీహెచ్‌ఎంసీ’ యాప్ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవడంతో పాటు ఓటరు నమోదు కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు.
యాప్‌లో ‘నియర్ మి’ ఓపెన్ చేసి, స్క్రీన్ కుడివైపున్న ఎరుపు అడ్డగీతలపై నొక్కితే వివిధ అంశాలతో మెనూ వస్తుంది. అందులో ‘ఎలక్టోరల్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంప్’ను ఓపెన్ చేస్తే... ఓటర్ నమోదు కేంద్రాలు ఎక్కడున్నాయో ఎరుపు రంగులో కనిపిస్తాయి. వాటిపై నొక్కితే వార్డు, సర్కిల్, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నెంబర్‌తో సహా ఓటరు నమోదు కేంద్రం చిరునామా కనిపిస్తుంది. మీరున్న ప్రదేశం నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్ ద్వారా సూచిస్తుంది. ఎంత సమయం పడుతుందో కూడా తెలుపుతుంది.
సాంకేతికతతో ‘సవరణ’
సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ జాబితాలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతను వినియోగిస్తోంది. బోగస్ ఓట్లను ఏరివేసేందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్(ఏరోనెట్) విధానాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటు హక్కు ఉందో తెలిసిపోతుంది. ఈ వివరాల ఆధారంగా అధికారులు విచారించి, ఒకే ఓటు కల్పిస్తారు. ఈ నెల 10న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంతో మంది నగరంలో స్థిరపడ్డారు. కొంతమందికి సొంతూరుతో పాటు సిటీలోనూ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడీ విధానంతో వాటిని తొలగిస్తారు.
⇔ ‘సువిధ’ యాప్: దరఖాస్తు చేసినా ఓటు హక్కు రాలేదనే ఫిర్యాదులకు చెక్ పెట్టేలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో సేవలందించేలా ‘సువిధ’ యాప్ రూపొందించారు.
⇔ ‘సివిజిల్’ యాప్: ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేలా సివిజిల్ యాప్‌ను రూపొందించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో విచారించి ఫిర్యాదు అందుకున్న రెండు గంటల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని 803 పోలింగ్ కేంద్రాలకు జియోట్యాగింగ్ పూర్తి చేశారు.
⇔ దివ్యాంగులందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా...
⇔ www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
⇔ ఇందులో ఈ–రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫారం 6, ఫారం 7, ఫారం 8, ఫారం 8ఎ, ట్రాక్ యువర్ స్టేటస్ ఇన్ ఎన్‌వీఎస్‌పీ, నో యువర్ స్టేటస్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
⇔ వీటిలో మీకు అవసరమైన దానిపై క్లిక్ చేయాలి. ఇంగ్లిష్ భాషను ఎంచుకోవాలి.
⇔ అక్కడ అడిగిన వివరాలన్నీ పూర్తి చేయాలి. కుటుంబం లేదా పొరుగింటివారి ఓటరు కార్డు నెంబర్ పొందుపరచాలి. అన్ని వివరాలు నింపాక పక్కనే ఉండే ప్రాంతీయ (తెలుగు) భాషలోనూ భర్తీ చేయాలి.
⇔ వివరాలన్నీ కరెక్ట్‌గా పూర్తి చేసి, జతపరచాల్సిన పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
⇔ తర్వాత రెఫరెన్స్ ఐడీ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
⇔ పోలింగ్‌బూత్, బీఎల్‌ఓ, ఈఆర్‌ఓ, డీఈఓ వివరాలు కూడా పొందొచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటో, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నేరుగా అధికారులకు దరఖాస్తు చేసుకునేవారు నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందజేయాల్సి ఉంటుంది.
హెల్ప్‌లైన్ 1800–599–2999
ఓటరు నమోదు, చిరునామాల్లో మార్పు, పొరపాట్ల సవరణ తదితరాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా... ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం కావాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 1800–599–2999కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 1950 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి.
ఏ ఫారం దేనికి?
⇔ ఫారం 6 – కొత్తగా ఓటు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరోనియోజకవర్గానికి చిరునామా మార్పు.
⇔ ఫారం 6ఎ – ప్రవాస భారతీయులునగరంలో ఓటరుగా నమోదుచేసుకోవడానికి
⇔ ఫారం 7 – జాబితాలో పేరు తొలగింపు కోసం, ఎవరి పేరుపై అయినాఅభ్యంతరాలకు
⇔ ఫారం 8 – జాబితాలో పొరపాట్లసవరణకు
⇔ ఫారం 8ఎ – ఒకే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇల్లు మారిన వారు చిరునామాలో మార్పు కోసం సమర్పించాలి.
హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు –3,826
⇔ గతంలో 3,761 మాత్రమే ఉండగా... ప్రజల సౌకర్యార్థం 65 కేంద్రాలు అదనంగా పెంచారు.
⇔ నియోజకవర్గానికి ఒకరు చొప్పున జిల్లాలోని 15 నియోజకవర్గాలకు 15మంది ఓటరు నమోదు అధికారులు(ఈఆర్‌ఓ) ఉన్నారు. వీరు కాకుండా 32మంది సహాయ ఈఆర్‌ఓలు, 575మంది సూపర్‌వైజర్లు, పోలింగ్ కేంద్రానికి ఒకరు చొప్పున 3,826 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు.
⇔ క్లెయిమ్స్, అభ్యంతరాలను 1,581 ప్రాంతాల్లోని ఓటరు నమోదు కేంద్రాల్లోఈ నెల 25 వరకు స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment