‘రంగు’పడుద్ది
నెల్లూరు (సెంట్రల్) : రంగురంగుల స్వీట్లు, నోరూరించే ఆహార పదార్థాలు. మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి దుకాణాల యజమానులు తినుబండారాలకు చిక్కనైన రంగులు వాడుతున్నారు. ఇవేవి తెలియని ప్రజలకు ఆ స్వీట్లను చూడగానే తినాలనిపిస్తుంది. అయితే ఇలాంటి తినుబండారాలు తినడం వల్ల క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ రంగుల ఫుడ్ కల్చర్ ప్రస్తుతం గ్రామాలకు విస్తరించింది. మారుతున్న కాలానుగుణంగా ధరలను సైతం లెక్కచేయకుండా రెడీమెడ్ తినుబండారాలపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ఎక్కువగా బిరియాని, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, చికెన్ ఐటెమ్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటిల్లో ఈ రంగుల వాడకం ఎక్కువగా ఉంది. ఇవే కాకుండా చిన్నచిన్న తిండి పదార్థాల్లో కూడా రంగులను వాడుతున్నారు. రంగులు వాడకం వల్ల శరీరంలో కొన్ని భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం
ఆహార పదార్థాలపై వాడే రంగుల వల్ల ఎక్కువగా జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవే కాకుండా లివర్, కిడ్నీలపై ఈ ప్రభావం ఉంటుందని, ఎక్కువైతే క్యాన్సర్ బారిన పడే ప్రమాదమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా స్వీట్స్‌లో వాడే సిల్వర్ లాంటి పేపర్ వల్ల ప్రమాదమంటున్నారు. మితిమీరిన రంగుల వాడకం వల్ల వ్యాపారులకు లాభాలు వస్తాయేమోగాని ప్రజలకు మాత్రం రోగాలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఈ రంగులు వాడిన పదార్థాలు తింటే పొగతాగడం కంటే ఎక్కువగా నష్టాలున్నాయని పలువురు వైద్యులు చెబుతున్నారు. రంగురంగుల పదార్థాలు కొనే సమయంలో కాస్త ఆలోచించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
నిబంధనలు ఎక్కడ?
నిబంధనల ప్రకారం మిఠాయిల్లో మాత్రమే వినియోగించాలి. ఐఎస్‌ఐ వంటి గుర్తింపు ఉన్న రంగులను మాత్రమే వాడాలి. అదీ కూడా కేజీకి 0.1 మిల్లీ గ్రాములు మాత్రమే వాడాలి. ఈ ప్రమాణాల్లో మాత్రమే రంగులు వాడితే ఆహార పదార్థాలు అంతగా ఆకర్షణీయంగా కనపడవనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో రంగులు వాడుతున్నారు. అదీ తక్కువ ధరకు వచ్చే వాటిని వినియోగిస్తున్నారు.