అసెంబ్లీలో చర్చ జరక్కుంటే చాలా నష్టం: వెంకయ్య | T bill should be discussed in Assembly , says Venkaiah naidu | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో చర్చ జరక్కుంటే చాలా నష్టం: వెంకయ్య

Published Mon, Jan 6 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

అసెంబ్లీలో చర్చ జరక్కుంటే చాలా నష్టం: వెంకయ్య

అసెంబ్లీలో చర్చ జరక్కుంటే చాలా నష్టం: వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

పార్టీలు ప్రజల మనోగతాలను ఆవిష్కరించాలి
ప్రధాని హోదానే మన్మోహన్ దిగజార్చారు


 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక చర్చ జరక్కపోతే నష్టమే ఎక్కువ ఉంటుందని, ప్రజల మనోగతాలను ఆవిష్కరించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారమిక్కడ పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, సురేష్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదని, తెలంగాణ ఏర్పాటు చేస్తూనే సీమాంధ్ర ప్రజల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై, పార్లమెంటుపై ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తానూ చెప్పాల్సింది చాలా ఉందని, ఓ రోజు తప్పక చెప్తానని అన్నారు.

 పీఎం స్థాయిని దిగజార్చారు..: మన్మోహన్‌సింగ్ ప్రధాని పదవి స్థాయినే దిగజార్చారని వెంకయ్య మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలిచే స్థితి లేకపోవడంతోనేమన్మోహన్ తప్పుకుంటానన్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని, వినాశనం తప్ప మన్మోహనం ఏమీ లేదని చెప్పారు. మోడీపై మన్మోహన్ వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనంగా అభివర్ణించారు. ఇందిరాగాంధీ హత్యకు గురయినప్పుడు జరిగిన వాటినే ఊచకోతలంటారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీలకు కొరతేమీ ఉండదని, వాటివల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదన్నారు. కొత్తవారు ప్రధాని కావాలని కలలు కనొచ్చని, అయితే వీళ్లెవ్వరూ మోడీకి సరితూగరని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17,18 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్యవర్గం, 19న జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని చెప్పారు. తమ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు గెలుస్తుందని, అయినా మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెంకయ్య చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement