‘టీ’ బిల్లును వెనక్కి పంపేయాలి
Published Sun, Dec 15 2013 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్ర బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపించేయాలని, ఒకవేళ అసెంబ్లీలో తీర్మానానికి ప్రతిపాదిస్తే సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తే రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో కాంగ్రె స్ జెండాలను తమ కార్యకర్తలు పీకిపారేస్తారని హెచ్చరించారు. పాలకొల్లులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లులో సీమాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా దానిని రూపొందించారని పేర్కొన్నా రు.
రాష్ట్ర విభజనతో నీటి యుద్ధా లు జరుగుతాయని హెచ్చరించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నా రు. 1991లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాలకోసం 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా, గోదావరి జలాల కోసం ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తగవులాడుకోవాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు రాజకీయ జేఏసీగా ఏర్పడి బిల్లును వ్యతిరేకించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించి పోరాటం చేయాల్సిన అవసరం వుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగానే ఏపీఎన్జీవోలంతా మెరుపు సమ్మెకు సిద్ధంకావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్‌రాజు, కోరం ముసలయ్య, రాష్ట్ర లీగల్ అడ్వయిజర్ డీకేవీ ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు వర్థనపు మోహనరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement