తలాపునే గోదావరి నది పారుతున్నా తాగేందుకు నీరు దొరకని పరిస్థితి జైపూర్ మండల ప్రజలది. మండల ప్రజలు తమకు గోదావరి తాగునీరు అందించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటూ వచ్చారు.
- గొంతు తడపని గోదావరి
- నత్తనడకన నీటి పథకం పనులు
- 18 గ్రామాల ప్రజలకు నిరాశే..
- {పజాప్రతినిధుల మౌనం.. పట్టించుకోని అధికార గణం
జైపూర్ : తలాపునే గోదావరి నది పారుతున్నా తాగేందుకు నీరు దొరకని పరిస్థితి జైపూర్ మండల ప్రజలది. మండల ప్రజలు తమకు గోదావరి తాగునీరు అందించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు దివంగత ముఖ్యమంతి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో జైపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గోదావరి తాగునీరు అందించే పథకాన్ని మంజూరు చేశారు.
ఈ పథకం ద్వారా మండలంలోని 18 గ్రామాలకు గోదావరి తాగునీరు అందించేందుకు 2009లో రూ.5.50 కోట్ల నిధులు మంజూరు విడలయ్యాయి. దీంతో 50 శాతం మండల ప్రజలకు గోదావరి నీరు అందించేందుకు అధికారులు పథకాన్ని రూపొందించారు. ఈ మేరకు అప్పటి కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ 2009 ఫిబ్రవరి 26న ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది పనులు చేపట్టారు. సంవత్సరంలోపు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది.
అయితే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఆలసత్వంతో ఐదేళ్లుగా నీటి పథకం అసంపూర్తిగానే మిగిలింది. ఇప్పటిదాకా గోదావరి నది ఒడ్డున పంపౌజ్, షెట్‌పల్లి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. షెట్‌పల్లి నుంచి గంగిపల్లి, పెగడపల్లి, జైపూర్ గ్రామాల మీదుగా భీమారం, పోలంపల్లి, వరకు పైపులైన్ కూడా చేశారు. అవసరమున్న చోట సంపులు కూడా నిర్మించారు. అయినా నిర్మాణం పూర్తి చేయలేదు. ప్రస్తుతం నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి.
ప్రజాప్రతినిధుల మౌనం ఎందుకో?
మండలంలో 50 శాతం మంది ప్రజలకు గోదావరి తాగునీరు అందించే నీటి పథకం ఐదేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నా స్థానిక ప్రజా ప్రతి నిధులు మాత్రం మాట్లాడడం లేదు. ప్రజాప్రతినిధుల ఈ తాగు నీటి పథకంపై మౌనం ఉండడంతో ప్రజల్లో ఆనుమానం వ్యక్తం అవుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి తోడు నాయకులూ పట్టింపు చేయకపోవడంతో ఏటా తాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.