ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గత ఎనిమిది రోజులుగా వేతన సవరణ చేయాలంటూ
కోర్కెలు సాధించిన కార్మికుల విజయోత్సవాలు
బాణసంచా కాల్చి... స్వీట్లు పంచుకున్న నేతలు
{పతిపక్ష నేత అండగా నిలిచారని జేఏసీ కృతజ్ఞతలు
పోరాటానికి సంఘీభావం ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు: జేఏసీ
శ్రీకాకుళం అర్బన్:ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గత ఎనిమిది రోజులుగా వేతన సవరణ చేయాలంటూ చేపట్టిన ఆందోళనలకు ప్రతిపక్షనాయకులు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలపగా ప్రభుత్వం దిగి రావడంతో తమ కోర్కెలు తీరాయి. దీంతో శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. తమకు సహకరించిన వైఎస్సార్‌సీపీనాయకులు, వామపక్ష నాయకులు, ప్రజాసంఘాలకు స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సంస్థలో పనిచేసిన వివిధ యూనియన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి చేసిన పోరాటాల ఫలితంగానే సమస్యలు సాధించుకోగలిగారని అన్నారు. వారిది న్యాయమైన పోరాటం కనుకనే ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు.
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో నైజమని, ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేసేందుకు కార్మిక సంఘ నాయకులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష పార్టీ నేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన అల్టిమేటమ్ కారణంగానే ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు తాండ్ర ప్రకాష్, చాపర సుందరలాల్, ఎం.తిరుపతిరావు, టి.తిరుపతిరావు, నేతింటి నీలంరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం హర్షణీయమన్నారు.
కార్మికవర్గంతో పెట్టుకుంటే మనుగడ సాగించలేమని ప్రభుత్వం గ్రహించిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, శిమ్మ వెంకటరావు, కోరాడ రమేష్, టి.కామేశ్వరి, ఎం.ఎ.రఫి, వామపక్ష నాయకులు డి.గోవింద్, వై.చలపతిరావు, చిక్కాల గోవిందరావు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎస్.అప్పారావు, కె.శంకరరావు(సుమన్), ఎం.వి.రమణ, పప్పల రాధాకృష్ణ, పి.రమేష్, బీఎల్‌పీ రావు, రోణంకి వెంకట్రావు, శాంతరాజు, ఎస్.వి.రమణ, డి.వర్మ, జి.రమణమ్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన రోజు
ఈ రోజు ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండిన రోజు. కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం హర్షణీయం, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సిద్దా రాఘవరావు, కార్మికశాఖమంత్రి అచ్చెన్నకు ధన్యవాదాలు. సమ్మెకు మొదటి నుంచి సంపూర్ణ మద్దతు అందించిన ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డికి, తమ్మినేని సీతారాంకు కృతజ్ఞతలు.
- పి.నానాజీ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
అనుకున్నది సాధించుకున్నాం
ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులంతా 43శాతం వేతన సవరణ కోసం సమ్మెకు దిగాం. అనుకున్నది సాధించుకున్నాం. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గుర్తింపు సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్‌కు ఎన్‌ఎంయూగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. కార్మికుల సమస్య పరిష్కారానికి ఉపసంఘాన్ని నియమించి సమస్య పరిష్కారానికి కృషిచేసిన సీఎంకు, మంత్రులకు కృతజ్ఞతలు. మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకులకు, వామపక్షనాయకులకు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు.
- ఎం.ఎ.రాజు, ఆర్టీసీ జేఏసీ చైర్మన్