ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. లేదా ఒకటి కొనండి రెండు ఉచితంగా పొందండి.. ఇవి పండుగల సీజన్‌లోనో.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో వినియోగదారులకు వ్యాపారులిచ్చే ఆఫర్లు.. తాజాగా అలాంటి ఆఫర్ రాజకీయాల్లోనూ వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటు కమలనాథులకు దక్కింది. దీంతో ఆ సీటును ఆశించిన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు అటు హైదరాబాద్‌లోను, ఇటు విజయవాడలోను ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఎంపీ సుజనాచౌదరి రంగంలోకి దిగి సెంట్రల్ సీటు వదులుకుంటే జిల్లాలో రెండు సీట్లు ఇస్తామంటూ బీజేపీకి బేరం పెట్టడం గమనార్హం.
సాక్షి, విజయవాడ: బీజేపీ, టీడీపీల మధ్య కుదిరిన పొత్తు రెండు పార్టీలకు తలనొప్పిలా మారింది. ఐదేళ్లుగా పార్టీకోసం లక్షలాది రూపాయలు మంచినీళ్లప్రాయంలా ఖర్చుపెట్టిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు సీటు రాదని తెలిసేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన బొండా ఉమామహేశ్వరరావుకు ఆ సీటు దక్కకపోవచ్చని అనుమానం రావడంతో ఆయన తన స్వరం మారుస్తున్నారు.
దీంతో టీడీపీ నేతలు ఒక మెట్టు దిగివచ్చి ఉమ సీటును కాపాడేందుకు బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. బొండా ఉమ పార్టీకి దూరమైతే జిల్లాలో ఒక బలమైన సామాజికవర్గానికి అన్యాయం చేశారనే ప్రచారం జరుగుతుందనే భయం టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఈ క్రమంలో సెంట్రల్ స్థానాన్ని బీజేపీ నుంచి రాబట్టేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
రంగంలోకి దిగిన సుజనా..
విజయవాడ సెంట్రల్ సీటుతోపాటు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సీటును బీజేపీకి ఇస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. దీనిపై ఉమతోపాటు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గరంగరంగా ఉన్నారు. ఎలాగైనా ఈ రెండు సీట్లు మార్పు చేసేలా కమలనాథులను ఒప్పించేందుకు టీడీపీకి చెందిన ఎంపీ సుజనాచౌదరి రంగంలోకి దిగినట్లు తెలిసింది. విజయవాడ పార్లమెంట్ సీటుతోపాటు సెంట్రల్ సీటుకోసం బీజేపీ తొలుత పట్టుబట్టింది.ఒప్పందంలో భాగంగా విజయవాడ పార్లమెంట్ సీటు బీజేపీ వదులుకుంటే సెంట్రల్ సీటు ఇస్తామంటూ టీడీపీ తొలుత ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ సీటు కూడా వదులు కుంటే జిల్లాలో రెండు సీట్లు ఇస్తామంటూ సుజనాచౌదరి బేరం చేస్తున్నట్లు సమాచారం.
సెంట్రల్‌కు బదులు తూర్పు లేదా పశ్చిమం
విజయవాడ తూర్పు లేదా పశ్చిమ సీట్లల్లో ఒకటి ఇవ్వడంతోపాటు నూజివీడు, కైకలూరుల్లో ఒక సీటు ఇస్తామని, నరసరావుపేట స్థానాన్ని వదులుకుంటే గుంటూరు-2 లేదా మంగళగిరి సీటు ఇస్తామంటూ సుజనా బీజేపీ వద్ద బేరం పెట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమకు కొద్దొగొప్పో బలం ఉన్న సెంట్రల్ సీటును వదులుకుంటే తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అసలు గెలవలేమనే భావనలో బీజేపీ దళపతులున్నారు.
నూజివీడు, కైకలూరు సీట్లు తమకు ఎంతమేరకు లాభిస్తాయనే అంశంపై మంగళవారం బీజేపీకి కొంతమంది నేతలు కసరత్తు చేశారు. కైక లూరులో బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్, నూజివీడులో రాష్ట్ర నేత కె.వి. లక్ష్మీపతి రాజా ఉన్నారు. వారికిగాని, వారు సూచించిన వ్యక్తులకు గాని ఇవ్వడం వల్ల పార్టీ గెలుస్తుందా.. లేదా అని అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ కూడా మార్పులుచేర్పుల ప్రతిపాదనలను టీడీపీ దృష్టికి తీసుకువస్తోంది.
ముఖ్యంగా అరకు పార్లమెంట్ స్థానం తమకు అక్కర్లేదని, దానికి బదులుగా కాకినాడ, ఒంగోలు స్థానాల్లో ఒకటి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇంకా నాలుగైదు అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పు కోరుకుంటోంది. బీజేపీ సూచించిన మార్పులను టీడీపీ అంగీకరిస్తే, టీడీపీ ప్రతిపాదనలను బీజేపీ అంగీకరించే అవకాశం ఉంది.
బంపర్ ఆఫర్ ఒకటికి రెండు
Published Wed, Apr 9 2014 1:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement