కడప కార్పొరేషన్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడకుండా రాహుల్‌గాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కడపలోని వైఎస్‌ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను ఎగదోసి చంద్రబాబు తన పబ్బం గడుపుకున్నాడని, ఫలితంగా కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశారన్నారు.
తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని, బంగళాఖాతంలో కలపాలని మాట్లాడారని గర్తు చేశారు. సోనియా, రాహుల్‌ను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఉన్నట్టుండి ఎలా పవిత్రుడయ్యాడని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టడమే పది నాలుకలతో పుట్టాడని, ఆయన అవకాశవాద రాజకీయాలను మోయాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్‌కు ఏంటని నిలదీశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంపారం చేసి, వారు తానా అంటే తందానా అన్నారని, ప్యాకేజీ ప్రకటించగానే హోదా కంటే గొప్పదని సంబరాలు చేసుకొని, సన్మానాలు చేశారన్నారు.
ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి ప్రత్యేక హోదాను మోదీ వద్ద తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసి, మోసం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం దారుణమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన పాపం వల్ల స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా నిలపలేని స్థితికి చేరిందన్నారు. ఏ పార్టీలోకి పోలేకనే ఆయన కాంగ్రెస్‌లో చేరారన్నారు. నాలుగున్నరేళ్లు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు.
ఇక్కడ డ్యామేజీ అయిన ప్రతిసారీ ఢిల్లీకి వెళ్లడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులకు శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చినంత మాత్రానా రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇది చంద్రబాబును రక్షించాల్సిన సమయం కాదని, శిక్షించాల్సిన సమయమన్నారు. సేవ్ ఏపి నినాదంతో భావసారుప్యత కలిగిన పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్‌టీఆర్ ఉన్నప్పుడు రాజకీయాల్లో నీళ్లు బాగుండేవని, ఇప్పుడు బురద ఎక్కువైందన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకోలేదని, అసలు రాజకీయాల్లో ఉంటానో లేదో కూడా తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment