క్రీడాకారులకు అందని ఆర్థిక భరోసా..! | TDP Delayed on Sports Mens Financial Helps | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు అందని ఆర్థిక భరోసా..!

Published Mon, Jan 21 2019 7:33 AM | Last Updated on Mon, Jan 21 2019 7:33 AM

TDP Delayed on Sports Mens Financial Helps - Sakshi

ఆటలాడుతున్న క్రీడాకారులు

విజయనగరం మున్సిపాలిటీ: మట్టిలో మాణిక్యాలకు ఆర్థిక భరోసా కరువవుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించేవారి పౌష్టికాహారం కోసం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) డే బోర్డర్స్‌ పథకం పేరిట ప్రతి నెలా అందించే ఆర్థిక సాయం అందకపోవడమే నిదర్శనం. 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న పేద క్రీడాకారులను గుర్తించి డే బోర్డర్‌ పథకం అమలు చేయాలని గతేడాది మార్గదర్శకాలు జారీ చేయగా...  క్రీడాకారులను గుర్తించి, వారిని ఎంపిక చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు  క్రీడాంశాల్లో మాత్రమే క్రీడాకారులను ఎంపిక చేశారు.

ప్రోత్సాహం లేకుంటే ఎలా..?
క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలంటే వారికి నచ్చిన ఆటలో ఆసక్తి, అంకితభావం, తపన ఎంత అవసరమో శిక్షణ కూడా అంతే ముఖ్యం. శిక్షణ అందుకోవాలంటే అందుకు తగ్గట్టు శరీరసష్టవం అవసరం. కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడల్లో పేదింటి పిల్లలు రాణిస్తున్నారు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా క్రీడల్లో కఠోర సాధన చేస్తుంటారు. ఇటువంటి వారికి పౌష్టికాహారం నిమిత్తం ప్రతీనెలా కొంత నగదు బ్యాంకు ఖాతాల్లో వేసి, వారిని ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డే బోర్డర్స్‌ పేరుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అక్కరకు రావడంలేదు.

ఇదీ పరిస్థితి...
డే బోర్డర్స్‌ పథకంలో 13 క్రీడాంశాలుంటాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, రైఫిల్‌ షూటింగ్, టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్, యోగా అంశాల్లో క్రీడాకారులను ఎంపిక చేయాలి. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాటరీ, మోటార్‌ ఎబిలిటీ, ప్రతిభ పరీక్షల ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. శాప్‌ నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఎంపికలు నిర్వహిస్తారు. విద్యలకు నిలయమైన విజయనగరం జిల్లాలో  ప్రస్తుతానికి స్విమ్మింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మాత్రమే ఎంపికలు పూర్తి చేశారు. డే బోర్డర్స్‌ పథకం వర్తింప చేయకపోవడంపై వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతున్న అర్హులైన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారంతో పాటు వీరికి అవసరమైన స్పోర్ట్స్‌ కిట్‌ను అందించి, బీమా అమలు చేయాలి. ఈ పథకంలో ఎంపికైన క్రీడాకారులకు శాప్‌ డీఎస్‌ఏ కోచ్‌లు, క్రీడా సంఘాలకు కోచ్‌లు, వ్యాయామ అధ్యాపకులు, ఫిజికల్‌ లిట్రసీ ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తారు. శిక్షణ సజావుగా అందిస్తున్నా అర్హులైన నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందడం లేదు.

ఎంపిక ఇలా..
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సబ్‌ జూనియర్‌ విభాగంలో 12 నుంచి 15 ఏళ్లు, జూనియర్‌ విభాగంలో 16 నుంచి 19 ఏళ్లు,  సీనియర్స్‌ విభాగంలో 19 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ పథకానికి అర్హులు. క్రీడాకారులు పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో జాతీయస్థాయిలో చూపిన ప్రతిభ, యూనివర్సిటీ, ఇంటర్‌ వర్సిటీ స్థాయిలో ప్రతిభ కొలమానంగా తీసుకుంటారు. ఎంపికైన క్రీడాకారుల్లో సబ్‌ జూనియర్స్‌కు రూ.1,500, జూనియర్స్‌కు రూ.2,500, సీనియర్స్‌కు రూ.4,000 వారి బ్యాంక్‌ ఖాతాల్లో ప్రతినెలా జమచేయాలి. కానీ అతి తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలినవారు నిరాదరణకు గురవుతున్నారు.

త్వరలో ఎంపికలు 
డే బోర్డర్‌ స్కీంలో మొత్తం 13 క్రీడాంశాల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశాల్లో సుమారు 50 మందికి  ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ కోచ్‌లు ఉన్న క్రీడాంశాలకే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇటీవల కాలంలో శాప్‌ ఆధ్వర్యంలో ఔట్‌ సోర్సింగ్‌ కోచ్‌లను నియమించారు. దీంతో త్వరలో ఎంపికలు నిర్వహించి మిగిలిన క్రీడాంశాల్లోని క్రీడాకారులకు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటాం.– అప్పలనాయుడు,  డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement