ప్రతిపక్ష నేత జగన్ గొంతు నొక్కారు
నరసరావుపేట వెస్ట్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి గొంతు నొక్కి అధికాపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టేట్‌మెంట్ ఇస్తారని ప్రకటించి రిజల్యూషన్ ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కావాలనే జగన్‌మోహనరెడ్డిని చర్చలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు.
తాను మాట్లాడతానని జగన్‌మోహనరెడ్డి పదే పదే కోరినా అవకాశం ఇవ్వలేదన్నారు. రైతులకు ఓపిక నశించి రుణమాఫీ అడగలేని విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బంగారు, డ్వాక్రా రుణాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా విధివిధానాలు రూపొందిస్తోందని తెలి పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతి జిల్లాకు చేసిన వాగ్దానాలు అమలు కావాలంటే రూ.20 లక్షల కోట్లు కావాలని తెలిపారు. లింగంగుంట్లకు చెందిన 1900 ఎకరాల భూములకు రైతులు రిజిస్ట్రేషన్లు, రుణాలు తీసుకోవటం, విక్రయాలు చేసుకునేందుకు ఎండోమెంట్, రెవెన్యూ మంత్రులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ కె.శంకరయాదవ్, ఎస్సీసెల్ కన్వీనర్ కందుల ఎజ్రా, మండల కార్యదర్శి భవనం రమణారెడ్డి పాల్గొన్నారు.