డేటా స్కాం బాగోతంలో రాష్ట్ర ప్రభుత్వ తీగలాగితే అనేక డొంకలు కదులుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టి ఆ నిధులను పక్కదారి పట్టించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు బదలాయింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌కు ప్రభుత్వం చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పేదలు, కూలీల సంక్షేమం కన్నా పార్టీ ప్రయోజనాలకే తెలుగుదేశం సర్కార్ పెద్దపీట వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాకులను కొట్టి గద్దలకు పెట్టడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఇప్పటివరకూ రూ.48కోట్లు ముట్టజెప్పినట్లు సమాచారం. ఐటీ గ్రిడ్స్‌కు రూ.10.50 కోట్లు చెల్లించేందుకూ సర్కార్ సిద్ధమైంది. అలాగే, దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్.. ఉపాధి హామీ పథకానికి సాఫ్ట్‌వేర్ సేవలను అందజేస్తుండగా ఆ నిధుల నుంచి కూడా చిన్న ఐటీ సంస్థ అయినా ఐటీ గ్రిడ్స్‌కు నిధులు చెల్లించడం గమనార్హం. – సాక్షి, అమరావతి
నిధులు అందుబాటులో లేవంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలకు గత నవంబరు నుంచి సర్కారు చెల్లింపులను నిలిపివేసింది. ఇలా ఇప్పటివరకు వారికి రూ.540కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు.. ఐటీ గ్రిడ్స్‌కు మాత్రం సర్కారు ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తూ వస్తోంది. ఇలా 2018 జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో ఆ సంస్థకు రూ.కోటి వరకు ఇచ్చింది. అంతేకాక, రానున్న ఎన్నికల్లోగా మరో రూ.6కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపులన్నీ హైదరాబాద్ బేగంపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఐటీ గ్రిడ్స్ పేరిట ఉన్న ఖాతాలో ఉపాధి కూలీల నిధి నుంచి విడతల వారీగా చెల్లించారు. 2018 జూన్ 14న రూ.59,13,120లు, సెప్లెంబరు 5న మరో రూ.18,53,280లు, నవంబరు 23న రూ.12,12,640లు, ఈ ఏడాది జనవరి 3న మరో 12,12,640లు ఆ ఖాతాలో జమ చేసింది. ఇలా రెక్కాడితే కానీ డొక్కాడని ఉపాధి కూలీల బిల్లులను పెండింగ్‌లో పెట్టి ఐటీ గ్రిడ్స్‌కు ఆఘమేఘాలపై బిల్లులు చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూనియర్ ఐఏఎస్‌పై లోకేశ్ ప్రేమ
మంత్రి లోకేశ్ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన రంజిత్ బాషాకు ఏడాది క్రితం ఐఏఎస్ హోదా దక్కింది. ఆ వెంటనే ఆయన లోకేశ్ శాఖలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల రెండింటికీ ఉమ్మడి డైరెక్టర్‌గా నియమితుల య్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిం చాల్సిన ఆ బాధ్యతల్లో జూనియర్ ఐఏఎస్‌ను నియమించడంపై అప్పట్లో ఆరోపణలొచ్చాయి. తన శాఖ పరిధిలోని వివిధ విభాగాల నుంచి కోట్లాది రూపాయలను అస్మదీయులైన ఐటీ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈయనను ఏరికోరి నియమించుకున్నట్లు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పంచాయతీ నిధులు సైతం పక్కదారి
పార్టీ వ్యవహారాలకు ఐటీ గ్రిడ్స్ సంస్థను ఉపయోగించుకుంటు న్నట్లు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, పార్టీ నేతలందరూ నాలుగు రోజులుగా ఊదరగొడుతున్నారు. అయితే, ఇప్పుడా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎలా చెల్లిస్తారన్న దానిపై అధికార, రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడు స్తోంది. మరోవైపు.. లోకేశ్ మంత్రిగా కొన సాగుతున్న పంచాయతీరాజ్ శాఖ పరి« దిలో ఆ సంస్థ చేసిన పనులకు గ్రామ పంచా యతీల నుంచి చెల్లింపులు చేసేందుకు కస రత్తు జరుగుతోందని అధికారులు చెబుతు న్నారు. అలాగే, అదే లోకేశ్ పరిధిలోని గ్రామీ ణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూ ఎస్) శాఖ నుంచి మరో రూ.3 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్లూఫ్రాగ్ పైనా అంతులేని ప్రేమ
ఇదిలా ఉంటే.. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే మరో ఐటీ సంస్థ బ్లూఫ్రాగ్ సంస్థ పైనా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తోంది. ఈ సంస్థతో ఇప్పటివరకు రూ.38 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ మంత్రిగా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం శాఖలోనే కూలీలందరి బ్యాంకు ఖాతాలు, వారి ఫోను నెంబర్లతో కూడిన కూలీ కార్డుల జాబితాను భద్రంగా ఉంచేందుకు ఏటా రూ.1.90 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కొనసాగిస్తోంది. ఇందుకుగాను ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.10 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు లోకేశ్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌లో మరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ పేరిట జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈల ద్వారా రూ.2.70 కోట్లు.. పంచాయతీరాజ్ శాఖలోనే గ్రామాల్లో కరెంట్ స్తంభాలకు జియో ట్యాగింగ్ కోసం ఇదే సంస్థకు రూ. కోటి వరకు ప్రభుత్వం చెల్లించింది. అంతేకాక, డ్వాక్రా మహిళలందరి బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరిచేందుకు రూ.3 కోట్లు దాకా చెల్లించారు. రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట వేశారన్నది ఫొటోలతో సేకరించే ప్రక్రియనూ బ్లూఫ్రాగ్‌కే అప్పగించారు. రూ. 29 కోట్ల విలువ చేసే ఈ కాంట్రాక్టులో రూ.8 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాక, దానివల్ల ప్రయోజనం లేదంటూ ఆ కార్యక్రమాన్నే విరమించుకుంది. కాపు కార్పొరేషన్, సెర్ప్ సహా వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆస్తులకు జియో ట్యాగింగ్ అంటూ ఆయా శాఖల నుంచి మరో రూ.10 కోట్ల వరకు ఇదే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.‘కుటుంబ వికాసం–సమాజ వికాసం’ కార్యక్రమం కింద కూడా ఈ సంస్థకు మరో రూ.3కోట్లు చెల్లించేందుకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం డేటా స్కాంపై దుమారం లేకపోయినట్లయితే ఈ వారంలోనే ఆ డబ్బులు కూడా చెల్లించి ఉండేవారని అధికారులు చెబుతున్నారు.
పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి..
Published Thu, Mar 7 2019 10:01 AM | Last Updated on Thu, Mar 7 2019 10:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment