విశాఖపై చిన్నచూపు!
అమెరికా సహకారంతో దేశంలో స్మార్ట్ సిటీలుగా అవతరించే మూడు నగరాల్లో విశాఖ కూడా ఉంది. అంత ప్రాధాన్యమున్న విశాఖపై రాష్ర్ట ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఐఏఎస్ అధికారులను ఆగమేఘాలపై తరలించుకుపోతోంది. వారి స్థానంలో కొత్త అధికారుల నియామకంలో మీనమేషాలు లెక్కిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని కీలక శాఖలు చాలా వరకు ఇన్‌చార్జుల పాలనలోనే సాగుతున్నాయి. ఫైళ్లు కూడా ఎక్కడికక్కడే మూలుగుతున్నాయి. ఇప్పుడు జీవీఎంసీ పరిస్థితి అయితే మరీ ఘోరం. గత నెల 18న కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ బదిలీ కావడం ఇన్‌చార్జి బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. జేసీ ఆ బాధ్యతలు చేపట్టి మూడు వారాలు కాకుండానే ఆయనను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో జీవీఎంసీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఇన్‌చార్జి పాలనలో ఉండడంతో దీని పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
‘గ్రేటర్’ నిర్లిప్తత!
జీవీఎంసీ పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఇన్‌చార్జి కమిషనర్ హోదాలో ప్రవీణ్‌కుమార్ వద్దకు ఏ ఫైలూ తీసుకె ళ్లేందుకు అధికారులు సాహసించలేదు. ఒక వేళ తీసుకెళ్లినా.. ప్రతిదానికీ ఆయన కొర్రీలు వేయడంతో.. వాటికి సమాధానం చెప్పుకోలేక చాలా మంది ఫైళ్లను తమవద్దే అట్టిపెట్టుకున్నారు. మరోవైపు ఏమైనా అత్యవసర ఫైళ్లుంటే తనతో చర్చించాకే వాటిని పెట్టాలన్న ప్రవీణ్‌కుమార్ ఆదేశాలతో ఆ సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు.
అక్టోబర్ 2 నుంచి సుజల స్రవంతి అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్‌వో ప్లాంట్లకు సంబంధించిన ఫైల్ తీసుకెళ్లినప్పటినీ.. దానికీ కండిషనల్ అనుమతి మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఓ కాంట్రాక్టర్ 12 శాతం నష్టానికి టెండర్లు వేయగా, మరొకరు 4 శాతానికే వేశారు. దీంతో 4 శాతానికి వేసిన కాంట్రాక్టర్‌ను కూ డా 12 శాతం నష్టానికి ఒప్పించాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. జన్మభూమి-మా ఊరు కార్యాక్రమ ప్రచారానికి మైక్‌సెట్, కరపత్రాలు తదితర అవసరాలకు నిధుల కోసం జోనల్ కమిషనర్లు ఫైళ్లు పెట్టగా వాటిపైనా కొర్రీలు వేసినట్టు తెలిసింది. మరోవైపు రోజువారీ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారి పరిస్థితీ అగమ్యగోచరంగానే ఉంది. జోనల్ కార్యాలయాల్లో పని జరగక, ప్రధాన కార్యాలయంలో తమ గోడు వినిపించుకునేవారు లేక నగరవాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రవీణ్‌కుమార్ కూడా బదిలీ కావడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారయింది.
‘వుడా’దీనత్వం!
యువరాజ్ కలెక్టర్‌గా బదిలీ అయి బాధ్యతలు చేపట్టిన తర్వాత వుడా వీసీ పోస్టు ఖాళీగా ఉంది. ఆరంభంలో అప్పటి జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ తర్వాత ఆ బాధ్యతల్ని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబుకు కేటాయించారు. మూడు మాసాల నుంచి వుడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క పనీ చేపట్టిన దాఖలాల్లేవు. గతంలో యువరాజ్ ఉన్నపుడు ఖరారు చేసిన వేలం పాటలు మినహా మరే ప్రాజెక్టూ చేపట్టలేదు.
అప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు కూడా ముందుకు కదలని పరిస్థితి. హరిత గృహ సముదాయం, చిల్డ్రన్స్ ఎరీనా, కైలాసగిరిపై నిర్మిస్తున్న తెలుగు మ్యూజియం తదితర ప్రాజెక్టులన్నీ కనీస కదలిక లేకుండా ఉన్నాయి. రుషికొండలోని రో హౌసింగ్ మిగులు యూనిట్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పీసీపీఐఆర్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆక్షేపణలున్నాయి. అజమాయిషీ చేసే అధికారి లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సిబ్బంది చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రెండు విభాగాలకు రెగ్యులర్ అధికారుల్ని కేటాయించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతుందని సిబ్బంది వాపోతున్నారు.