
సాక్షి, అమరావతి: చాలీచాలని వేతనాలతో విధి నిర్వహణ చేస్తున్న హోంగార్డుల జీ(వి)తాలతో చెలగాటం ఆడుతున్నారు. మండుటెండల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి అలవెన్సు(డీఏ)లోను కోత పెట్టారు. జీతాలకు అలవెన్సులకు ముడిపెట్టి డీజీపీ కార్యాలయం ఇచ్చిన సర్క్యులర్‌పై హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం 65 రోజులు పనిచేసిన తమకు కేవలం 15 రోజులకే డీఏ ఇచ్చారంటూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 12 వేల మంది హోంగార్డులు వాపోతున్నారు. అదే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమకు డీఏ రూ.9 వేలు ఇవ్వగా ఈసారి రూ.4,500లతో సరిపెట్టడం దారుణమని మండిపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు సర్కారు ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రవేశపెట్టిన పలు పథకాలకు ఖజానా ఖాళీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేసి ఎన్నికల పథకాలకు నిధులు మళ్లించారు. పోలీసు శాఖలో అధికారుల అలవెన్సులు, బిల్లులు మంజూరు కాలేదు. హోంగార్డులకు అయితే మూడు నుంచి నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా నిలిపివేశారు. ఎన్నికల అనంతరం వారికి జీతాలు చెల్లించారు.
హోంగార్డుల వేతనాల అవసరాలపై డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్
కొత్త మెలికతో కోతపెట్టారు...
డీజీపీ కార్యాలయం నుంచి ఇచ్చిన సర్క్యులర్‌లో పెట్టిన కొత్త మెలికతో అలవెన్సుల్లో కోతపెట్టినట్టు హోంగార్డులు వాపోతున్నారు. వాస్తవానికి పోలీస్‌శాఖ నుంచి హోంగార్డుల వేతనం, ఎన్నికల ఫండ్స్ నుంచి డీఏ ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా అలవెన్సును అరకొరగా ఇవ్వడంతోపాటు వేతనాన్ని కూడా ఎన్నికల ఫండ్స్ నుంచే ఇవ్వడం గమనార్హం. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రోజుకు జీతం రూ.600, అలవెన్సు రూ.300 కలిపి మొత్తం రూ.900 చొప్పున మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ లెక్కన 15 రోజులకు వేతనం రూ.9 వేలు, అలవెన్సు రూ.4,500 ఇవ్వాలి. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మాత్రం 15 రోజులకు అలవెన్సు ఇవ్వకుండానే రోజుకు రూ.600 చొప్పున కేటాయించారు. ఈ లెక్కన ఏప్రిల్ నెలకు మొత్తం రూ.22,500తోపాటు మే 20 నుంచి 24 వరకు జీతం రూ.600 చొప్పున మొత్తం రూ.3వేలు ఎన్నికల ఫండ్స్ ఇచ్చేలా సర్క్యులర్ ఇవ్వడం పట్ల హోంగార్డులు తప్పుబడుతున్నారు.
కానిస్టేబుల్స్ తరహాలో అలవెన్సు ఇవ్వాలి
వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు దాదాపు 65 రోజుల పాటు విధులు నిర్వహించే తమకు డీఏ చెల్లించాల్సి ఉందని హోంగార్డులు చెబుతున్నారు. ఈ లెక్కన అలవెన్సు ఒక్కటే 19,500 రావాల్సి ఉందని చెబుతున్నారు. కానీ 15 రోజులకే అలవెన్సు ఇచ్చారని ఆవేదన చెందుతున్నారు. అదే తమతోపాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్‌కు మాత్రం 65 రోజులకు చెల్లిస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసేందుకు హోంగార్డులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానిస్టేబుల్స్‌తో సమానంగానైనా తమకు ఎన్నికల అలవెన్సులు ఇప్పించాలని కోరునున్నట్టు వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment