నెల్లూరు: పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా.. తమ్ముళ్లకు పదవులు అందని ద్రాక్షలా మారాయి. తమ్ముళ్ల మధ్య ఉన్న తగాదాలతో నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదాపడుతూనే వస్తోంది. పదవులపై ఆశలు పెట్టుకున్న తమ్ముళ్లు కొందరు తీవ్ర నిరుత్సాహంతో ఉండటంతో పార్టీ పదవులు కట్టబెట్టి సంతృప్తిపరచేందుకు టీడీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు నెల్లూరు జిల్లా నేతలు కమిటీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. పదవుల కోసం నెల్లూరు జిల్లా నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మె ల్సీ, నూడా, ఆర్టీసీ చైర్మన్, 10 మార్కెట్ కమిటీలు, 7 దేవాలయాలకు పాలకమండళ్ల నియామకం జరగాల్సి ఉంది. వీటి భర్తీకి సంబంధించి జాబితాను సిద్ధం చేసి అధినేత బాబుకు అందించారు. అయితే జాబితా వడపోసి తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం.
ముగ్గురు మూడు దారులు
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి జాబితా వడపోత చేయాలంటే మంత్రి నారాయణ, ఆదాల, సోమిరెడ్డి, బీదా రవిచంద్ర బేటీ కావాల్సి ఉంది. అయితే వీరిలో మంత్రి, బీదా ఒకవర్గం అయితే.. మిగిలిన ఇద్దరు చెరో వర్గంగా తయారైనట్లు టీడీపీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు, ఆదాల ఓ వర్గం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జడ్ శివప్రసాద్, కిలారి వెంకటస్వామి, రూరల్‌కు చెందిన కొందరు నేతలు సోమిరెడ్డ్డితో ఉంటున్నారు. బీదా, అనూరాధ, రమేష్‌రెడ్డి, చాట్ల నరసింహరావు మంత్రి వర్గంగా ముద్ర ఉంది. ఈ మూడు వర్గాలు సమావేశమై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు ఒక్కటయ్యే అవకాశమే లేద ని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగటం లేదని తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నూడాపై కమలనాధుల కన్ను
నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒకరికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రిని చేయాలని సీఎం ఆలోచన. అందుకు రవి చంద్ర పేరు దాదాపు ఖరారైందనే ప్రచా రం ఉంది. మరొకటి ఇచ్చేపనైతే సోమిరెడ్డికి ఇవ్వొచ్చు. ఎమ్మెల్సీ పదవి సోమిరెడ్డికి రాకుండా చేయాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే సోమిరెడ్డి మాత్రం టీడీపీలో తనకున్న పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నూడా చైర్మన్ పదవి దాదాపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధకు ఖరారైనట్టేనని పార్టీవర్గాలంటున్నాయి. అయితే ఈ పదవిపై కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నూడా చైర్మన్ పదవి జాబితాలో వెంకయ్యనాయుడు కుమార్తె పేరు తెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన కొందరు కమలనాథులు నూడా పదవి తమ వారికే ఉంటే జిల్లాలోని పార్టీ నేతలకు కొంత బలం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామినాయుడు లేదా పమ్మిడి రవికుమార్ చౌదరి పోటీపడుతున్నారు.
అసంతృప్తులను బుజ్జగించే యత్నం
నామినేటెడ్ పదవుల భర్తీ విషయం ఇం కా కొలిక్కిరాకపోవటంతో పార్టీ పదవులపై అధినేత దృష్టిసారించినట్లు సమాచా రం. జిల్లాకు చెందిన తమ్ముళ్లు ఒక్కటవ్వకపోవటంతో కనీసం పార్టీ పదవులను కట్టబెట్టి కార్యకర్తలను సంతృప్తిపరచాలని నిర్ణయం తీసుకునట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో స్థానికసంస్థల ఎన్నికల కు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజికవర్గానికి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఆ పదవికి పెళ్లకూరు పేరు వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలతో పాటు, గ్రా మ, మండల, డివిజన్, జిల్లా కమిటీల నియామకాలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
గ్రూపులు కలవవ్.. పదవులు రావ్..
Published Wed, Feb 4 2015 4:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement