
కోటబొమ్మాళి ఇన్‌చార్జి ఎంపీడీఓ రాజేశ్వరమ్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు
సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో దందాలు చేసిన అచ్చెన్నాయుడికి ఇంకా పాత వాసనలు వదిలినట్టు లేదు.. ఏకంగా మహిళా ఎంపీడీఓ మీదే దండెత్తారు. గత ప్రభుత్వంలో అక్రమంగా సంక్షేమ పథకాలను అందుకున్న అనర్హులను అధికార యంత్రాంగం తొలగిస్తుండడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. సాక్షాత్తు తన సొంత మండలంలోనే ఇటువంటి పారదర్శక పాలన కొనసాగుతుండడంతో తన మార్క్‌కు భంగం కలుగుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. దీంతో శనివారం కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఇన్‌చార్జి ఎంపీడీఓ ఎస్.రాజేశ్వరమ్మతోపాటు మిగిలిన అధికారులను బెదిరిస్తూ చిందులు వేశారు.
మండల పరిషత్ కార్యాలయానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువవుతోందని, దీనిని కట్టడి చేయాలంటూ ఆమెను హెచ్చరించారు. దంత పంచాయతీలో పింఛన్ల తొలగింపుపై చిందులు తొక్కారు. తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓను అచ్చెన్నాయుడు బెదిరించారు. దీంతో మండల పరిషత్ కార్యాలయ సిబ్బందితోపాటు మిగిలిన అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment