సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటి ముందు డీఎస్పీ ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు అతికించారు. గృహనిర్బంధంలో ఉన్న వ్యక్తి పోలీసుల ముందు నుంచే ఉడాయించడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. వంద మంది పోలీసులు ఇంటి ముందు ఉదయం నుంచి కాపలాకాసినా బయటకు రాని చింతమనేని పోలీసుల సంఖ్య తగ్గిన సమయం చూసుకుని వెళ్లిపోయారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసేందుకు వారెంట్ సిద్ధమవుతున్న తరుణంలో చింతమనేని ఇక్కడికే వెళ్లి వస్తానంటూ మెల్లగా జారుకున్నారు. ఇలా పరారీ కావడం వెనుక పోలీసుల సహకారం ఉన్నట్టు తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా చేతిలోని వ్యక్తిని వదిలేసిన పోలీసు అధికారులు తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసుకుంటూ లబోదిబోమంటూ చింతమనేని కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనను జిల్లా పోలీసు ఉన్నతాధికారి సీరియస్‌గా తీసుకోవటంతో కిందిస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకువెళుతున్న దళిత యువతపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడుతూ, దాడికి యత్నించారు. ఈ సంఘటనపై చింతమనేనితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు శుక్రవారం ఉదయం దుగ్గిరాల గ్రామంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఏలూరు నగరంలోని పోలీసు యంత్రాంగం భారీగా స్పెషల్ పోలీసులు చింతమనేని ఇంటి వద్ద మోహరించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తన ఇంటికి చేరుకోవడంతో చింతమనేని ప్రభాకర్ మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. విషయం తెలిసిన ఆయన అనుచురులు చింతమనేని ఇంటికి చేరుకుని హడావుడి చేశారు. బయటకు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో చింతమనేని రాకుండా తాత్సారం చేశారు. అయితే మధ్యాహ్నం తరువాత ఇంటినుంచి బయటకు వచ్చిన చింతమనేని మీడియాతో మాట్లాడి, ఇక్కడికే వెళ్లి వస్తా అంటూ పోలీసులకు చెప్పి చల్లగా జారుకున్నారు. అయితే ప్రభాకర్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు అతడు కారులో వెళ్లిపోతున్నా అలానే చూస్తూ ఉండిపోయారు.
చింతమనేని ఇంటి గోడకు పోలీసులు అంటించిన నోటీసు
పోలీసుల తీరుపై అనుమానం
చింతమనేని ప్రభాకర్ కళ్ల ముందే దర్జాగా కారులో వెళ్లిపోయినా పోలీసులు కనీసం అతడిని అడ్డగించేందుకు కూడా ప్రయత్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనకు పరిచయం ఉన్న పోలీసుల సహకారంతోనే చింతమనేని పరారైనట్టు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటకు రెండు కారుల్లో వచ్చిన చింతమనేని ఏలూరు జాతీయ రహదారిపైకి వచ్చిన అనంతరం పోలీసుల కళ్లు కప్పేందుకు రెండు వైపులకు రెండు కార్లను పోనిచ్చి తికమక చేసి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఎస్‌ఐలు సంఘటనా స్థలంలోనే ఉన్నట్టు సమాచారం. ఉదయం చింతమనేనిని అరెస్టు చేయాలని పో లీసుల ఆదేశాలు వచ్చిన్పటినుంచి ఇద్దరు, ముగ్గురు ఎస్‌ఐలు చింతమనేని ప్రభాకర్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
పోలీసుల ప్రతి కదలికనూ వారే చేరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో ఆయన నియోజకవర్గంలో పని చేసిన అధికారులే ఈ పనిచేశారని నిఘా విభా గాలు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్టు సమాచారం. జిల్లా ఎస్పీ కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే సమయంలో తగిన వ్యూహం లేకపోవడమే అతను తప్పించుకుపోవడానికి కారణంగా భావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ తెలంగాణలో తలదాచుకుని ఉండచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment