(ఫైల్ ఫోటో)
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పత్తికోళ్ల లంక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టారనే నెపంతో పార్టీ సానుభూతిపరులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం దాడికి దిగింది. వివరాల్లోకి వెళితే.. గత మూడేళ్లుగా గ్రామానికి చెందిన దాదాపు 900 ఎకరాల భూమి సాగుచేసుకుంటున్న చింతమనేని.. సుమారు 15 కోట్ల రూపాయలు గ్రామానికి బాకీ పడ్డారు. ఈ నేపథ్యంలో చింతమనేని తీరును ప్రశ్నిస్తూ ఓ వర్గం పత్తికోళ్ల లంకలో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీంతో ఆగ్రహించిన చింతమనేని వర్గం వారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రాక్షస పాలన కొనసాగుతోంది..
చింతమనేని వర్గం చేతిలో దాడికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దెందులూరు నియోజవర్గంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. పత్తికోళ్ల లంకలో చింతమనేని ప్రభాకర్ భయానక వాతావరణం సృష్టించారని అబ్బాయి చౌదరి విమర్శించారు. ఓవైపు గ్రామంలో ఇటువంటి పరిస్థితులు నెలకొంటే చింతమనేని మాత్రం కోడి పందేల పేరిట డబ్బు సంపాదించడంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి దెందులూరు నియోజకవర్గ ప్రజలను చింతమనేని బారి నుంచి కాపాడాలన్నారు. చింతమనేనికి ప్రజలు మరో మూడు నెలల్లో తప్పక బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment