
పీలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడు కిశోర్‌కుమార్ రెడ్డి ఆగడాలు మితిమీరుతున్నాయని ఉద్యోగ వర్గాలు కలవరపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ ఫోన్ చేసి దుర్భాషలాడుతుండడంతో హడలిపోతున్నారు. వయసు, అర్హతలకు కూడా విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులతో మొర పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. సర్దుకుపోండని ఉచిత సలహాలిస్తున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నారు. కలికిరిలో పనిచేస్తున్న ఓ వీఆర్వో ఒత్తిడి తట్టుకోలేక రెండేళ్ల సర్వీసు ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు పోస్టు ద్వారా పంపాడు.
చిత్తూరు, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి సోదరుడు..ఇటీవల అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వైఖరితో ఉద్యోగవర్గాలు వేసారుతున్నాయి. ఈయన బాధిత ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. కలికిరి మండలంలో ఎక్కువ చుక్కల భూములున్నాయి. వీటి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులు ఆ పనిలో బిజీ అయ్యారు. ఇదే సమయంలో కలికిరి గ్రామ పరిధిలోనే సైనిక్ స్కూల్ పక్కనే ఉన్న విలువైన చుక్కల భూమిని తన అనుచరుల పేరుపై రెగ్యులరైజ్ చేయాలని కిశోర్ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. రెవెన్యూ రికార్డుల్లో పట్టా మంజూ రు చేసినట్లు ఉండటంతో తహసీల్దార్ నటరాజ రెండుసార్లు దరఖాస్తును తిరస్కరించారు.
దీంతో తహసీల్దార్‌పై కిశోర్ పలుమార్లు ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేసినా రెగ్యులరైజ్ చేయలేమని తహసీల్దార్ కిశోర్‌కు తేల్చిచెప్పారు. కోపోద్రిక్తుడైన కిశోర్ ‘నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. నీ అంతు చూస్తా. వెంటనే లీవ్ పెట్టి వెళ్లిపో’ అని తహసీల్దార్‌ను బెదిరించాడు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘కొంచెం చూసుకుని వెళ్లు’ అని సమాధానం రావడంతో అవాక్కవడం తహసీల్దార్ వంతయింది. ఒత్తిడిని తట్టుకోలేక నెల రోజులు సెలవుపై వెళ్లాడు. ఇదే క్రమంలో కలికిరి గ్రామ వీఆర్వో కూడా 15 రోజులు సెలవుపై వెళ్లారు.
నోరు తెరిస్తే బూతులే..
వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసేందుకు ప్రభుత్వం డీఆర్‌డీఏ వెలుగు ద్వారా మండలానికి ఒక ట్రాక్టర్ కేటాయించింది. ఒక్కసారి కూడా రైతులు ట్రాక్టర్‌ను ఉపయోగించుకోలేదు. స్థానిక ఏపీఎం ఒక రైతుకు నెలసరి బాడుగకు ఇచ్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న కిశోర్ శుక్రవారం ఏపీఎంను పిలిచి దుర్భాషలాడారని తెలిసింది. ఎవర్నడిగి ట్రాక్టర్ బాడుగకు ఇచ్చావు.. ఏం తమాషాలు చేస్తున్నావా? ప్రభుత్వం మాది. అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారని భోగట్టా. దీంతో ఆ ఏపీఎం లీవుపై వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి..
పీలేరు నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్లారి ఫోన్ అంటేనే అధికారులు హడలిపోయే పరిస్థితి ఉంది. కొన్నాళ్ల క్రితం పీలేరు ఎంపీడీఓ వసుంధరమ్మకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పెన్షన్లు నేను చెప్పిన వారికే ఇవ్వాలని బెదిరించడంతో ఆమె కన్నీరుమున్నీరయింది. హౌసింగ్‌లో ప్రోగ్రెస్ లేదని వాయల్పాడు హౌసింగ్ ఏఈ సదాశివారెడ్డిని తిడుతున్నారని సమాచారం. వైఎస్సార్సీపీ వాళ్లకు ఇళ్లను ఎలా కేటాయిస్తావని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని చెబున్నారని అధికారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment