శుభ రియల్ ఎస్టేట్‌లో ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయం తహశీల్దార్ స్పష్టం చేశారని గాజులరేగకు చెందిన టీడీపీ నాయకుడు నడిపిలి రవికుమార్ అన్నారు.
* టీడీపీ నాయకుడు రవికుమార్
* సాక్షి కథనానికి వివరణ
విజయనగరం కంటోన్మెంట్: శుభ రియల్ ఎస్టేట్‌లో ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయం తహశీల్దార్ స్పష్టం చేశారని గాజులరేగకు చెందిన టీడీపీ నాయకుడు నడిపిలి రవికుమార్ అన్నారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు’ కథనానికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుభ రియల్‌ఎస్టేట్ యజమాని పెంటపాటి సురేష్ ప్రభుత్వ భూమిలో నిర్మించిన ముఖద్వారాన్ని అధికారులు కూల్చేశారన్నారు.
ఈ విషయమై గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. మాపై వీడియోలు, చిత్రాలు తీసి బెదిరించారని, దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. అసలు అతను ఏ పార్టీకి చెందిన వారు.. డిప్యూటీ సీఎం, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చేంతగా ఇతనిని ఎవరు రికమెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ద్వారపూడి, తదితర గ్రామాల్లో ఇళ్లు లేక పేదలు ఇబ్బంది పడుతుంటే ఈయన ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు గేదెల బంగార్రాజు, నారాయణరావు, కళ్లేపల్లి సూరిబాబు, తదితరులున్నారు.