సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రజల్లో పట్టులేదు..మాయమాటలు, అమలుకాని హామీలతో ఐదేళ్లు పబ్బం గడుపుకున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుడ్‌బై చెబుతారని భావిస్తున్న తరుణంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. పొదుపు మహిళలను టార్చర్ పెడుతున్నారు. గ్రామ ఇన్‌చార్జులం...వార్డు ఇన్‌చార్జులమంటూ పొదుపు గ్రూపుల అధ్యక్షులు, యానిమేటర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. గ్రూపు సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోవడంతో పాటుగా టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని, లేకుంటే మూడో విడత చెక్కులు పడవు...అవసరమైతే మీ పదవులను తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో కొందరు చేసేదిలేక బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తుండగా మరికొందరు మాత్రం ఈ రాజకీయాలు మాకెందుకంటూ తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకెళితే.. చీరాల నియోజకవర్గంలోని చీరాల మండలంలో 1717 గ్రూపులు, వేటపాలెం మండలంలో1410 గ్రూపులు, మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో 1422 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు గ్రూపు లీడర్లు ఉంటారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అధికారుల వద్ద పొదుపు గ్రూపుల పూర్తి వివరాలు తీసుకున్న టీడీపీ నేతలు వార్డులు, గ్రామాల వారీగా పొదుపు గ్రూపుల్లోని సభ్యులు, గ్రూపు లీడర్లతో మాట్లాడేందుకు యానిమేటర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రతిరోజు ప్రతి గ్రూపు వద్దకు వెళ్లి టీడీపీకి ఓట్లేయండి..మీకు డబ్బులు అందిస్తాం..అయితే మాకు అనుకూలంగా పనిచేయకపోతే పసుపు–కుంకుమ చెక్కులతో పాటు మీకు రావాల్సిన అన్నీ విధాలా లబ్ధిని అడ్డుకట్ట వేస్తామని, గ్రూపు లీడర్లు సభ్యులు సహకరించకుంటే లీడర్లను మార్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈపూరుపాలెంలోని పొదుపు గ్రూపులకు స్థానిక టీడీపీ నాయకులతో వలస టీడీపీ నేతలు మంతనాలు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న యానిమేటర్ల నుంచి గ్రామంలోని పొదుపు గ్రూపుల అన్నీ వివరాలు సేకరించడంతో పాటుగా ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేయించే బాధ్యత మీదే అని హుకుం జారీ చేస్తున్నారు. వలస నేతలను కొందరిని గ్రామాలకు, మున్సిపాలిటీలో వార్డులకు ఇన్‌చార్జులుగా నియమించుకుని పొదుపు మహిళల పూర్తి సమాచారాలు సేకరిస్తున్నారు. ఇన్‌చార్జుల పేరుతో ఒక్కో యానిమేటర్ ఆధీనంలో ఉన్న 30 గ్రూపుల సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాలను సేకరించుకుని వారితో టీడీపీకి తమ ఇంట్లో వారందరూ ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
‘‘ఒక్కో డ్వాక్రా మహిళకు పసుపు–కుంకుమ కింద సభ్యురాలికి రూ.10 వేలు ఇచ్చింది టీడీపీ, మళ్లీ మీకు ఏ ఇతర పథకాలు అందాల న్నా టీడీపీ అధికారంలోకి వస్తేనే దక్కుతాయి. మీరంతా ఖచ్చితంగా టీడీపీ కోసమే పనిచేయాలి. టీడీపీ గెలుపుకు మీరే ముఖ్యం. టీడీపీకి అనుకూలంగా పనిచేయకపోతే మీ సంగతి చూస్తామంటూ’’ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామాలు, వార్డుల్లోని పొదుపు మహిళలు ఇదేం ఖర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు మేము ఎందుకు పనిచేయాలి.. ఓటర్లు వారికి ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకుంటారు. ఈ బెదిరింపులు ఏంటని పొదుపు మహిళలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment