
జీలుగుమిల్లి/జంగారెడ్డిగూడెం రూరల్ : జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి మరమ్మతుల పేరుతో అధికారులు, నాయకులు రూ.కోట్లు దోపిడీ చేశారని ఏలూరు పార్లీమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త కోటగిరి శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన జాతీయ రహదారి దుస్థితిపై జీలుగుమిల్లి నుంచి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ద్వారా మ్యానిఫెస్టోను రూపొందించేందుకు వైఎస్ జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని నేరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు.
చంద్రబాబు కల్లబొల్లి మాటలు వినడానికి జనం సిద్ధంగా లేరని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రోడ్ల నిర్మాణం ప్రజల కోసం కాకుండా కొందరు జేబులు నింపుకునేందుకు వేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఈ రహదారులపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. జాతీయ రహదారుల చైర్మన్ గాని, జిల్లా మంత్రులుగాని ప్రజల కష్టాలకు స్పందించడం లేదని అన్నారు. పాలకుల తీరుకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో కొల్లూరి రాంబాబు, మండవల్లి సోంబాబు, పోల్నాటి బాబ్జీ, బీవీఆర్ చౌదర్, ఆది విష్టు, మేడవరపు అశోక్, వందనపు సాయిబాలపద్మ, గంజి మాలదేవి, కరాటం క్రిష్ణ స్వరూప్, జగ్గవరపు జానకీరెడ్డి, బోదా శ్రీనివాసరెడ్డి, చిర్రి బాలరాజు‡ తదితరులు పాల్గొన్నారు. రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చనమాల శ్రీనివాస్, పార్టీ నాయకులు కేమిశెట్టి మల్లిబాబు, కొప్పుల రవిచంద్రారెడ్డి, నులకాని వీరాస్వామి నాయుడు, కనికళ్ల ప్రసాద్, పల్లా గంగాధరరావు, చీదిరాల నాగేశ్వరరావు, మల్నీడి బాబి, రాజులపాటి అన్నవరం, దల్లి తుకారాంరెడ్డి, కొయ్య రాజారావు రెడ్డి, కొయ్య లీలాధరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మద్దిలో లక్ష్మీ గణపతి హోమం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలంటూ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన లక్ష్మీ గణపతి హోమం, మోటారు సైకిల్ ర్యాలీలో కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం మద్ది క్షేత్రం నుంచి భారీ మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో కోటగిరి శ్రీధర్‌తో పాటు వైఎస్సార్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. గుర్వాయిగూడెం అయ్యప్ప ఆలయాన్ని శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. పార్టీ యూత్ నాయకులు కఠారి వాసు తన ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో గుర్వాయిగూడెం అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. జంగారెడ్డి గూడెం మీదుగా జీలుగుమిల్లి వరకు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నాయకులు, మండల అధ్యక్షలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కదిలిన యంత్రాంగం
జీలుగుమిల్లి: రహదారి దుస్థితిపై వైఎస్సార్ సీపీ నాయకులు చేసిన పాదయాత్రతో అవినీతి అధికారులలో కలవరం మొదలైంది. శనివారం సాయంత్రం హుటాహుటీన నిఘా వర్గాలు రోడ్డును పరిశీలించాయి. పాదయాత్రపై ప్రజా స్పందన గురించి నివేదికను సేకరించారు. జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి మరమ్మతులకు గత మూడేళ్లుగా ఖర్చు చేసిన నిధుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపాయి. మరమ్మత్తులకు సంబంధించిన ఫొటోలు సేకరించారు. అలాగే ఆరోపణలపై కూడా వివరాలు సేకరించాయి.