సాక్షి, అమరావతి : పార్టీ అనుబంధ శాఖలకు కొత్తగా నియమించిన అధ్యక్షులపై టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. కీలకమైన తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారిపై పార్టీలోని ఇతర నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో పది అనుబంధ సంఘాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ నియామకంపై పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారిని విస్మరించి వేరే పార్టీ నుంచి కొంతకాలం క్రితం వచ్చిన అవినాష్‌కు పదవి ఇవ్వడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన అవినాష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు. ఆ పదవిలో ఉండగానే కొద్ది కాలం క్రితం టీడీపీలో చేరారు.
వాస్తవానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కుతుందని పార్టీ నేతలు భావించారు. గతంలో నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ ఈ పదవి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పదవి చేపట్టారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. పలువురు నుంచి అభ్యర్థనలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు ఆ పదవి ఇవ్వడంతో టీడీపీ బీసీ నేతలు కంగుతిన్నారు. ఇప్పటికే అవినాష్ సమీప బంధువు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అవినాష్ సోదరుడు చంద్రశేఖర్ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా పార్టీలోని ముఖ్య పదవులన్నీ ఒకే వర్గానికి ఇవ్వడం ఏమిటని బీసీ నేతలు మండిపడుతున్నారు.
మహిళ అధ్యక్షురాలినియామకంపైనా అసంతృప్తి
తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత నియామకంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిని ఉత్తరాంధ్రకు చెందిన శోభా హైమావతి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్నా ఆమెకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు హైమావతి స్థానంలో సునీతను నియమించడంపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన సునీత పార్టీలో కీలక నేత కాదని, ఆమె మహిళ అధ్యక్షురాలిగా రాణించలేరని చెబుతున్నారు. బీసీ సెల్ అధ్యక్షునిగా గుంటూరుకు చెందిన బోనబోయిన శ్రీనివాసరావును నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘అధ్యక్ష’ నియామకాలపై టీడీపీలో అసంతృప్తి
Published Sun, Jan 20 2019 10:47 AM | Last Updated on Sun, Jan 20 2019 3:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment