ఉషశ్రీ చరణ్, వరుదు కళ్యాణి, పోతుల సునీత, పి. అమ్మాజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ బాబు, భువనేశ్వరి, బ్రహ్మణి (బీ–3) బ్రాండ్లేనని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని పేర్కొన్నారు.
హెరిటేజ్ పేరుతో వారు పాల వ్యాపారం చేస్తున్నట్లు కనిపించినా తెర వెనక జరిగింది లిక్కర్ బేరమేనని వెల్లడించారు. మద్యం తయారీకి అనుమతులు ఇప్పించటాన్ని చంద్రబాబు, భువనేశ్వరి దశాబ్దాలుగా కుటీర పరిశ్రమగా మార్చుకున్నారని చెప్పారు. మద్యం సేవించటంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని.. ఇలా తాగి ఇటీవల కొట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని చెప్పారు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు.
ఒకవంక మగువ, మరోవంక మద్యం.. ఇదే పప్పు బ్రాండ్ అని లోకేష్‌పై ధ్వజమెత్తారు. ఇంట్లో అన్నింటికీ లైసెన్స్.. అది తమకు సాధారణమే అన్నట్లుగా నారా కుటుంబం వ్యవహార శైలి ఉందన్నారు. చుక్క లేకపోతే తండ్రీ కొడుకులు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరని చెప్పారు. ఆదివారం అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లిలో వారు వేర్వురుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్‌లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు.
► మద్యం కంపెనీలన్నీ టీడీపీ నేతలవే. ఎస్‌పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్‌పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? ఆయన టీడీపీ నాయకుడు కాదా?
► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేతఅయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని ఆయన చెబుతున్నారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నదే కదా? ఎన్నికల ముందు ఆ కంపెనీకి చంద్రబాబు అనుమతి ఇచ్చారా? లేదా?
► పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు.. బ్రాండ్లకు అనుమతి ఇచ్చినది ఆయన హయాంలోనే. లిక్కర్ విక్రయాలను ఆకాశానికి పెంచింది చంద్రబాబే. ఈ అనుమతులన్నీ బీ–3 వల్లే వచ్చాయి. టీడీపీ నేతలు ఈ అనుమతుల కోసం లంచాలు ఎవరికి ఇస్తారు?
మద్యం వినియోగం తగ్గింది..
► లిక్కర్ సేల్స్ పెంచితే కమీషన్లు వస్తాయి గానీ తగ్గిస్తే ఎవరైనా ఇస్తారా? బెల్ట్ షాపుల్ని రద్దు చేసి, బార్ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్ రూముల్ని మూసి వేయించి, ప్రభుత్వ దుకాణాల ద్వారా ఇప్పుడు పరిమితంగా లిక్కర్ అమ్ముతున్నారు. ఇలా విక్రయాలు గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా కమీషన్లు ఇస్తారా?
► రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు ఉంటే 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి. ఇదే సమయంలో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసుల నుంచి గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి.
► 2018–19లో మద్యం విక్రయాల ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021–22లో ఆదాయం రూ. 25,023 కోట్లు ఉంది.
► 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లన్నీ రద్దు చేశాం. 4,380 నుంచి 2,934కి వైన్ షాప్‌లను తగ్గించాం.
► ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులుంటే విచ్చలవిడిగా మద్యం విక్రయించి బెల్టుషాపులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రభుత్వమే పరిమితంగా నిర్ణీత వేళల్లో విక్రయాలు చేపట్టింది.
► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఎస్‌ఈబీ ద్వారా ఎక్కడిక్కడ దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నాం.
డిస్టిలరీల ఓనర్లు పచ్చబాబులే
► భవిష్యత్తులో ఏర్పడే మద్యం డిమాండ్‌కు అనుగుణంగా అంటూ చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అదీ దిగిపోయే ముందు! లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే.
► 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇచ్చిందే లేదు.
► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయో గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు.
► సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే మళ్లీ దండలు వేస్తుంటారు. అలాగే గతంలో తాను అనుమతి ఇచ్చిన బ్రాండ్లు, డిస్టీలరీలపై మళ్లీ ఆయనే ఇవెక్కడివంటూ విమర్శలు చేస్తుంటారు.
ఆ దోపిడీ.. బీ–3 కుంభకోణాలే
► ఇసుక అమ్మకాల్లో ఇప్పుడు రూ.4,000 కోట్లు వస్తుంటే... గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఏమయిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణం.
► మైనింగ్ దోపిడీ ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణాలు.
► దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అన్నదే టీడీపీ విధానం. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్త పుత్రుడికి ఎప్పటికప్పుడు వాటాలు.
► టీడీపీ అంటేనే డీపీటీ. లంచాలకు ప్రతిఫలంగానే అనుకూల పత్రికలు, టీవీల్లో ఎల్లో ప్రచారాలు. ఈ కుంభకోణంపై న్యాయ విచారణ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment