
సీఎం జగన్ ఫ్లెక్సీని తొలగించి కిందపడేసిన దృశ్యం
తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలో ఉందనుకున్నారో? లేకుంటే అధికారం కోల్పోయామని తట్టుకోలేకపోయారో? ఏమో తెలియదు గానీ తెలుగు తమ్ముళ్లు కణేకల్లు మండలం యర్రగుంట గ్రామ సచివాలయంలో వీరంగం వేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించి కింద పడేశారు. సచివాలయం రికార్డులు, సర్వే కాగితాలను చించేసి గాలికి విసిరేశారు. అంతటితో ఆగకుండా మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వేసిన ఫ్లెక్సీని గోడకు అతికించారు. తెలుగుతమ్ముళ్ల వికృత చేష్టలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సాక్షి, కణేకల్లు: యర్రగుంట గ్రామ సచివాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గద్దె దింపి... జనరంజక పాలన కోసం ‘వైఎస్సార్‌సీపీ’కి అధికారాన్ని అప్పగించారు. గ్రామ సచివాలయంలో పంచాయతీ అధికారులు సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలతో కూడిన ఫ్లెక్సీని తగిలించారు. ఇటీవల గ్రామంలో ‘పల్లె పిలుపు’, ‘స్పందన’తోపాటు పలు కార్యక్రమాలు గ్రామ సచివాలయంలో జరుగుతున్నాయి. నిత్యం గ్రామ సచివాలయం రద్దీగా ఉంటుంది. సీఎం జగన్ ఫ్లెక్సీ ముందు సభలు, సమావేశాలు జరగడం చూసి మింగుడు పడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శనివారం రాత్రి 10గంటలకు గ్రామ సచివాలయాల తలుపులకేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి చొరబడ్డారు. సీఎం జగన్ ఫ్లెక్సీని తొలగించి కిందపడేశారు. గ్రామ వలంటీర్లు చేపట్టిన సర్వే కాగితాలు, సచివాలయంలో ఉన్న వివిధ రికార్డులను చించేసి విసిరేశారు.
ఓటమిని జీర్ణించుకోలేకే..
గత చంద్రబాబు ప్రభుత్వ ఫ్లెక్సీలను తీసుకొచ్చి గ్రామ సచివాయలంలో గోడకు అతికించారు. ఇంకా మా నాయకుడే సీఎం అని చూపించేందుకు తెలుగుతమ్ముళ్లు ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. టీడీపీ కార్యకర్తల వికృత చేష్టలపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మతి ఉండి ఇది చేశారా? మతిస్థిమితం కోల్పోయి ఇలా చేశారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయితీ కార్యదర్శి మాబు జరిగిన ఘటనపై కణేకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కానుగ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌పికెట్ కూడా ఏర్పాటు చేశారు.