
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సచివాలయంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటంపై గుర్తు తెలియని వ్యక్తులు బురదజల్లడం వివాదాస్పదంగా మారింది. గురువారం తెల్లవారు జామున ఈ దృశ్యాన్ని గుర్తించిన గ్రామ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఎం జగన్ చిత్రపటంపై ఇలాంటి దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందామన్న అక్కసుతో, వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై గ్రామ సెక్రటరీతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.