
ఆవురావురుమంటున్న తెలుగుతమ్ముళ్లు..
జనం స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టి రెండునెలలైంది. అయినాఇప్పటికీ తెలుగుదేశం.. జెడ్పీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి, వైస్ చైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అన్న విషయాలపై తల పట్టుకుంటూనే ఉంది. పదేళ్లు అధికార వియోగంతో ఆవురావురుమంటున్న తెలుగుతమ్ముళ్లు.. రాకరాక వచ్చిన అవకాశాన్ని దక్కించుకోవడానికి కుమ్ములాడుకోవడమే ఇందుకు కారణం. పదవి కోసం వేగిపోతున్న వారిని ఎలా చల్లార్చాలో; సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలో తెలియని జిల్లా నాయకులు ఆ తలపోటును అధినేతకే విడిచిపెట్టారు.
సాక్షి, కాకినాడ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో మొదలైన లొల్లి తారాస్థాయికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరనున్న తరుణంలో తెలుగుతమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఇందుకు వేదిక కావడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే కుమ్ములాట జరగడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్య పదవులకు అభ్యర్థిత్వాల్ని ఖరారు చేసేందుకు బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
గంటకు పైగా తర్జనభర్జనలు పడ్డా నేతలు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఎన్నికల ముందు నుంచి ఈ పీఠంపై పార్టీ సీనియర్ నేత, పి.గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు నామన రాంబాబు ఆశలు పెట్టుకోగా, ఎన్నికల అనంతరం ఐ.పోలవరం, రంగంపేట జెడ్పీటీసీ సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, పెండ్యాల నళీనీకాంత్ ఆ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నిక జరిగి రెండునెలలైనా చైర్మన్ అభ్యర్థిత్వంపై పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేక నాన్చివేస్తూ వచ్చింది. మరో రెండు రోజుల్లో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరనున్న వేళ బుధవారం జరిగిన అంతర్గత సమావేశం వేడివేడిగాసాగినట్టు తెలిసింది.
చైర్మన్ గిరీ కాపు సామాజికవర్గానికి చెందిన వారికి కేటాయించాలని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినందున నామన రాంబాబు లేదా పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందంటున్నారు. ఇద్దరూ కోనసీమకే చెందిన వారైనా కోనసీమకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల్లో కొందరు రాంబాబుకు, మరికొందరు రాజశేఖర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల్లో మెట్టలో పార్టీ ఉనికి దెబ్బ తిన్నందున కీలకమైన జెడ్పీ చైర్మన్ పీఠాన్ని మెట్టకు ఇవ్వాలని ఆ ప్రాంత ముఖ్యనేతలు పట్టుబట్టినట్టు తెలిసింది. జెడ్పీ పీఠం కూడా కోనసీమకే కట్టబెట్టడమేమిటని నిలదీసినట్టు చెబుతున్నారు. దీంతో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన జిల్లా నాయకత్వం నిర్ణయాన్ని పార్టీ అధినేతకు వదిలేసింది.
బీసీలకు ఇవ్వకుంటే సహించం..
చైర్మన్ పీఠాన్ని ఆశించి జెడ్పీ ఎన్నికల్లో దండిగా ఖర్చు చేసిన రంగంపేట జెడ్పీటీసీ పెండ్యాల నళినీకాంత్‌కు కనీసం వైఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని నళినీకాంత్‌కు ఇస్తే ఊరుకోబోమని సామర్లకోట జెడ్పీటీసీ గుమ్మళ్ల విజయలక్ష్మి వర్గీయులు తెగేసి చెప్పారు. సమావేశం అనంతరం ఈ రెండువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, హోం మంత్రి చినరాజప్ప, ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.
వాగ్వాదం రాజుకుని తోపులాటలకు దారి తీసింది. వారిని శాంతింపచేయడానికి రాజప్పకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. చివరికి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్లి బుజ్జగించారు. మెజారిటీగా ఉన్న బీసీలను కాదని వైస్ చైర్మన్ పదవి కమ్మవారికి కట్టబెడితే ఆ వర్గీయుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని సమావేశంలో నేతలు అభిప్రాయ పడినట్టు చెబుతున్నారు. చెర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థిత్వాల ఖరారు బాధ్యతను చంద్రబాబుకు అప్పగించినట్టు సమావేశం అనంతరం చినరాజప్ప విలేకరులకు తెలిపారు. సమావేశంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.