
తమ్ముళ్ల భూదందా
మచిలీపట్నం : మచిలీపట్నంలో తెలుగు తమ్ముళ్ల బరితేగిస్తున్నారు. భూదందాకు తెరతీశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాజేసేందుకు పన్నాగం వేశారు. బెదిరింపులకు దిగుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ సారథ్యంలో నారాయణపురంలోని బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న స్థలంలో పాగా వేశారు.
1.04 ఎకరాల భూమి ఆక్రమణకు ప్రయత్నం
నారాయణపురం బైపాస్‌రోడ్డు వెంబడి గోకరాజు సుభద్రాదేవి మరో ముగ్గురు 1985లో 1.04 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిలో చికెన్‌షాపు, హోటల్, ఆర్‌ఎంపీ వైద్యశాల నడుపుకునేందుకు అద్దెకు ఇచ్చారు. టీడీపీ నాయకులు.. వాటపల్లి మాధవీకుమారి తాతయ్య కుమారస్వామి పేరున కాగితాలు పుట్టించారు. భూమి తమ బంధువలదేనని ఇక్కడున్న కట్టడాలన్నీ తీసివేయాలంటూ హుకుం జారీ చేశారు. శుక్రవారం పొక్లెయిన్, ట్రాక్టర్లు, 200 మందిని తీసుకువెళ్లి బెదిరింపులకు దిగారు.
దీంతో అసలు భూమి యజమానులు భూమికి సంబంధించిన కాగితాలు తమ వద్ద ఉన్నాయని ఈ భూమి మీది ఎలా అవుతుందని ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన తాము చెబితే భూమి తమదే అవుతుందని, అవసరమైతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని లేకుంటే కోర్టును ఆశ్రయించాలని వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా భూమిలో చిన్నపాటి రేకులషెడ్డు ఏర్పాటు చేసి ఈ భూమిని ఎవరూ కొనుగోలు చేయవద్దని బోర్డు ఏర్పాటు చేశారు.
రూ. 50 లక్షలు ఇస్తామంటూ..
ఈ భూమి మాకు కావాల్సిందే. మర్యాదగా వింటే రూ.50 లక్షలు ఇస్తాం. అంతే తప్ప భూమిని వదిలేది లేదని టీడీపీ నాయకులు, రాయబారాలు పంపుతున్నారని భూ యజమానులు గోపరాజు జయరామ్, వేమూరి లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీ నాయకుల భూదందాపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇటీవలనే నారాయణపురంలో 40 సెంట్ల పురపాలక సంఘానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఓ ప్రజాప్రతినిధి గృహాలు నిర్మించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఈ అక్రమ కట్టడాలను నిలువరించారు. మళ్లీ కొద్ది రోజుల వ్యవధిలోనే బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న స్థలాన్ని ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.