‘నారాయణ’ మంత్రం
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతల జపం
కార్పొరేట్ లాబీయింగే కలిసొస్తుందన్న ఆశ
2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆయనెవరో రాష్ట్రప్రజలకు పెద్దగా తెలియదు. ఎన్నికలకు ముందు సీట్ల కోసం టీడీపీలో కార్పొరేట్ లాబీయింగే బాగా నడిచింది. దీంతో ఓ కార్పొరేట్ సంస్థ ప్రతినిధి అయిన ఆయన అకస్మాత్తుగా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వ చ్చారు. ఆ కార్పొరేట్ నేత సిఫార్సు మేరకే సీట్లు ఖరారు చేసింది. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆయనకే అధిష్టానం పెద్ద పీట వేస్తోంది. దీంతో సీనియారిటీ, పార్టీ పరమైన లాబీయింగ్ కలిసిరాదనే ఉద్దేశంతో నేతలంతా ఇప్పుడు ఆ కార్పొరేట్ ప్రతినిధి, రాష్ట్రమంత్రి నారాయణ..పేరును జపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆయన్ను కలిసి పదవుల కోసం ప్రాథేయ పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నికలకు ముందు ఒక్క విజయనగరం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనే సీట్ల ఎంపిక విషయంలో మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరించారు. అత్యధిక నియోజకవర్గాలకు ఆయన ప్రతిపాదించిన అభ్యర్థుల్నే అధిష్టానం ఖరారు చేసింది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లో సదరు అభ్యర్థుల విజయం కోసం భారీగా ఖర్చు పెట్టారన్న వాదనలు ఉన్నాయి. ఇక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నారాయణ హవాయే నడుస్తోంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణి ఎంపికలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్పాయి.
పార్టీ సీనియర్లుగా ఉన్న శోభా హైమావతి, ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, గద్దే బాబూరావు, తూముల భాస్కరరావు, డాక్టర్ వీఎస్ ప్రసాద్, తెంటు లక్ష్మునాయుడు, భంజ్‌దేవ్, లగుడు సింహాద్రి, కె.త్రిమూర్తులురాజు తదితరులు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా గుమ్మడి సంధ్యారాణిని అధిష్టానం ఎంపిక చేసింది. ఆమె ఎంపిక విషయంలో నారాయణ మాటే చెల్లుబాటు అయ్యిందన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఇదేదో అయ్యిందనేసరికి ఏంఎసీ కమిటీల ఖరారు విషయంలో కూడా నారాయణ సిఫార్సులే ఫలించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగిపోలేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా నారాయణే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినోళ్లే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గట్టిగా కోరుతున్నారు.
కానీ అధిష్టానం ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదిత జాబితాలో వీరి పేర్లు కాకుండా ఎవరికీ తెలియని ’నెల్లిమర్ల సత్యం’ పేరు చేరింది. ఈయనెవరో ఆ పార్టీ నేతలే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 20ఏళ్ల క్రితంలో ఆయన నెల్లిమర్ల మండలంలో ఉండేవారని, గతంలో వారి సంబంధీకులు రాజకీయాల్లో ఉండేవారని, భోగాపురంలో వందల ఎకరాల భూములు ఉన్నాయని, ప్రస్తుతం మంత్రి నారాయణ వ్యవహారాలు చూసుకుంటున్నారని రకరకాలుగా ఆరాతీసి క్లారిటీ తీసుకుంటున్నారు.
ఏదేమైనప్పటికీ ఎవరికీ తెలియని నెల్లిమర్ల సత్యం పేరు నారాయణ జోక్యంతోనే తెరపైకి వచ్చిందని పార్టీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా సీనియర్ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి సేవలందించని, ఎవరికీ తెలియని నేతను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయ డమేంటని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అభ్యర్థిత్వం సందిగ్ధంలో పడింది. ప్రభుత్వంలో ఏం సాధించాలన్నా, ఏం దక్కించుకోవాలన్నా నారాయణే కీలకమని, ఆయన దృష్టిలో పడితే చాలని, ఆయన సిఫార్సు చేస్తే పదవి ఖాయమనే అభిప్రాయానికి టీడీపీ నేతలొచ్చారు. దీంతో ఇప్పుడు ఒక్కొక్కరూ నారాయణను కలిస్తూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.