టీడీపీ నేతల కబ్జా పర్వం
► పేదల భూములను అనుభవిస్తున్న వైనం
► జీవనోపాధి లేక ఇబ్బందుల్లో దళితులు
ఎనిమిదేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగాంసెంటు భూమిలేక తిండి కోసం తిప్పలు పడుతున్నాం. పలువురు టీడీపీ నాయకులు పేదల భూములను లాక్కొని అన్యాయంగా కేసులు పెట్టించారు. ఎనిమిదేళ్లుగా కోర్టు చుట్టూతిరుగుతున్నాం. యాగాబత్తిన చెంగయ్య, దళితకాలనీ, పెళ్లకూరు
పెళ్లకూరు: నిరుపేద దళితులకు చెందాల్సిన భూములను ఎన్నో ఏళ్లుగా టీడీపీ నేతలు అనధికారికంగా రాచరిక పద్ధతిలో అనుభవిస్తున్నారు. దీంతో సెంటు భూమి లేని పలు పేద కుటుంబాలు జీవనోపాధి లేక తీవ్ర కష్టాలు పడుతున్నాయి. పెళ్లకూరు రెవెన్యూ పరిధిలోని స్వర్ణముఖి నదీ తీరాన వెంకటగిరి రాణికి సంబంధించి సర్వే నంబర్ 1 / 1లో వందెకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. 2008లో హైకోర్టు ఆదేశాలతో అప్పటి గూడూరు సబ్‌కలెక్టర్ ప్రద్యుమ్న భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన 125 మందికి ఒక్కొక్కరికీ 0.5 ఎకరాల చొప్పున మొత్తం 63 ఎకరాలను సీజేఎఫ్‌ఎస్ కింద పట్టాలను మంజూరు చేశారు.
సబ్‌డివిజన్ నంబర్ 170లోని తొమ్మిదెకరాలకు సంబంధించి పాలచ్చూరు, అత్తివరం గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్‌ను తీసుకోవడంతో ఆ భూములను పంపిణీ చేయకుండా సబ్‌కలెక్టర్ నిలిపేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు సబ్ డివిజన్లోని భూములకు బోగస్ పాస్‌పుస్తకాలను సృష్టించి దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. పాలచ్చూరుకు చెందిన మరో టీడీపీ నాయకుడు 2012లో అప్పటి తహ శీల్దార్, రెవెన్యూ సిబ్బంది సాయంతో బోగస్ పాస్‌పుస్తకాలను సృష్టించి, కంప్యూటర్ అడంగళ్లో టీడీపీ నేతల పేర్లను నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో టీడీపీ నాయకులు బ్యాంకు ల్లో భారీగా వ్యవసాయ రుణాలనూ పొందారు.
సబ్‌డివిజన్ సర్వే నంబర్ 164 నుంచి 170లోని సుమారు 40 ఎకరాలకు సంబంధించి పెరుమాళ్లపల్లికి చెందిన మరికొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్పట్లో రెవెన్యూ అధికారుల సాయంతో బోగస్ అడంగళ్లను సృష్టించి ఇప్పటి వరకు సాగుదారులుగా కొనసాగుతూ బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. ఫలితంగా అర్హులైన దళితులు, గిరిజనులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలను పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిశీలించి చర్యలు చేపడతాం
పేదలకు పట్టాలిచ్చిన భూములను భూస్వాములు ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరం. పెళ్లకూరులోని రాణి భూముల విషయాన్ని పరిశీలించి చర్యలు చేపడతాం- ఇంతియాజ్ అహ్మద్, జేసీ