బాలయ్యకు బావ చెక్!
పార్లమెంట్‌కు పంపే యోచనలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: టీడీపీలో మరో అధికార కేంద్రం ఏర్పడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను పార్టీ రాజకీయాలకు దూరంగా పెట్టేందుకు వీలుగా రాజ్యసభకు పంపాలన్న ఆలోచన చేసినట్టు సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తానని బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. ప్రవాసాంధ్రులతో చర్చలు జరపడమేగాక తన సన్నిహితులతో ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ బృందం ద్వారా నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ఎంపికపై కొంతమేరకు కసరత్తు చేసి కొందరిని ఎంపిక కూడా చేశారు.
బాలకృష్ణకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరికి మినహా ఆయన సూచించిన మిగిలిన వారెవరికీ టికెట్లు ఇవ్వరాదని చంద్రబాబు గట్టి నిర్ణయంతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికలు అనుకోనివిధంగా కలిసొచ్చాయని, ఒత్తిడి తెచ్చైనా బాలయ్యను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనతో ఉన్నట్టు చంద్రబాబు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. సాధ్యం కాకపోతే బాలకృష్ణను లోక్‌సభకు పోటీ చేయిస్తారేతప్ప అసెంబ్లీ టికెట్ మాత్రం ఇవ్వబోరట.