బాలయ్యకు ఎర వేస్తున్నారు: హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: తన సోదరుడు నందమూరి బాలకృష్ణను బుట్టలో వేసుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు ఇవ్వాలని యోచిస్తున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ధ్వజమెత్తారు. సమైక్యవాదినైన తనను ఆ రకంగా ఎవ్వరూ బుట్టలో వేసుకోలేరని చెప్పారు. తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆయన నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేతలతో తాను మాట్లాడుతున్నట్లు కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
తన ఫోన్ కాల్ లిస్ట్‌ను బహిర్గతం చేస్తానని, అదే ధైర్యం ఆరోపణలు చేసే వారికి ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్న నాయకులందరి కాల్‌లిస్ట్‌లు పరిశీలిస్తే టీడీపీ, కాంగ్రెస్ నేతల చర్చలన్నీ బహిర్గతమవుతాయని చెప్పారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆమె భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారు చెంచురాం తదితరులతో కలిసి నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్‌లో చంద్రబాబు, బాలకృష్ణ తదితరుల ఫ్లెక్సీలకన్నా జూనియర్ ఎన్‌టీఆర్‌వే ఎక్కువ కనిపించడం విశేషం.
టీడీపీలో మూర్ఖులున్నారు: హరికృష్ణ
టీడీపీలో మూర్ఖులున్నారు. నేను రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామా చేస్తే ఆవేశంతో రాజీనామా చేశానని కొన్ని కుక్కలు మొరిగాయి. ఎన్‌టీఆర్ ఆవేశం, తెలుగు ప్రజల ఆవేదన నుంచి టీడీపీ పుట్టింది. ఆ తండ్రి ఆవేశం, ప్రజల ఆవేదన నాలో ఉన్నందువల్లే ఎంపీ పదవికి రాజీనామా చేశా.
సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాష్ర్ట విభజనకు ఒడిగట్టారు. తామెక్కడ వెనకబడి పోతామోనన్న భయంతో ఒకరిని మించి ఒకరు విభజనకు సహకరిస్తున్నారు. నేనెప్పుడూ విభజనకు అనుకూలంగా వ్యవహరించలేదు. నేను విభజనకు అంగీకరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీచేయను
వచ్చే సాధారణ ఎన్నికల్లో నేను పోటీ చేయటంలేదు. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉంది. మా తాత స్థాపించిన టీడీపీ కోసం పనిచేయటం నా బాధ్యత. - జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ లేకపోవడంవల్లే
ఎన్టీఆర్ లేకపోవడమే ప్రస్తుత పరిణామాలకు కారణం. రాష్ట్రానికి సత్తా ఉన్న నాయకత్వం అవసరం. వచ్చే సాధారణ ఎన్నికల్లో నేను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచే పోటీచేస్తా. - కేంద్రమంత్రి పురందేశ్వరి
హరికృష్ణ మాట మార్చారు
ఎన్టీఆర్ జీవించి ఉంటే తెలంగాణ వచ్చేదని, తెలంగాణ వస్తే బాగుంటుందని హరికృష్ణ గతంలో అన్నారు. కానీ ఆ తరువాత మాట మార్చారు. నిజంగా ఎన్టీఆర్ జీవించి ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది.
- ఎర్రబెల్లి దయాకర్‌రావు