నందమూరి హరికృష్ణకు అవకాశం లేనట్టే...
టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణకు ఈసారి రాజ్యసభ టికెట్ విషయంలో నిరాశే మిగలనుందా? గత పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన హరికృష్ణ వచ్చే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తన బంధువు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది.
హరికృష్ణ మొదటిసారిగా 2008 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన సందర్భంగా సమైక్యాంధ్ర కోరుతూ హరికృష్ణ 2013 ఆగస్టులో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పదవీ కాలం ముగియడానికి ఏడు నెలల ముందుగానే రాజీనామా చేయగా, వచ్చే మార్చిలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇటీవలే చంద్రబాబు కలిసి కోరారు.
నాలుగు ఖాళీలు
2016 జూన్ 21 నాటికి ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రులు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి) (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్, జేడీ శీలం పదవీ కాలం పూర్తికానుంది. వీరిలో సుజనా చౌదరికి మరోసారి అవకాశం కల్పించాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ పట్టుదలతో ఉన్నారు. నిర్మలా సీతారామన్ 2014 రాజ్యసభ ఉపఎన్నికలో ఎన్నికయ్యారు. రెండేళ్లపాటే సభ్యురాలిగా ఉన్నందున బీజేపీ జాతీయ నాయకత్వం ఆమెకు మరోసారి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఏపీ శాసనసభలో కాంగ్రెస్‌కు అసలు ప్రాతినిథ్యమే లేకపోవడం కారణంగా ఇక ఆ పార్టీ నుంచి ఎన్నికైన జైరాం రమేష్, జేడీ శీలంకు ఏరకంగానూ ఛాన్స్ లేదు. శాసనసభలో పార్టీల బలాబలాలను బట్టి ఖాళీ అయ్యే మొత్తం నాలుగు స్థానాల్లో మూడింటిని టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు సాధించుకునే అవకాశం ఉండగా మరో స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది. బీజేపీ అభ్యర్థి నిర్మలా సీతారామన్‌తో పాటు సుజనా చౌదరి పేర్లు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరో స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకోగలదు.
హరికృష్ణకు చాన్స్ లేనట్టే...
రాజ్యసభ స్థానంపై హరికృష్ణ ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని సీనియర్లు చెబుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా లోకేష్ కనుసన్నల్లో కొనసాగుతోందని, తన మామ నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఒకే కుటుంబం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వరని అంటున్నారు. ఇలావుండగా, పార్టీలో ఎంతో సీనియర్ అయిన హరికృష్ణ రాజ్యసభ టికెట్ విషయంలో ఎంతో జూనియర్ అయిన లోకేష్‌ను కలిసి అడగడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని సన్నిహితులు చెబుతున్నారు.