సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్ 2 నాటికి ఖాళీ కానున్న మూడు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. టీడీపీ చివరి సభ్యుడి పదవీ కాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యాన్ని నిలుపుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలే చేశారు. తనదైన శైలిలో కుయుక్తులతో ఓ స్థానం గెల్చుకోవడానికి ప్రయత్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తగినంత సంఖ్యా బలం శాసన సభలో లేకపోయినా.. ఓటుకు కోట్లు ఎరగా వేయాలన్న వ్యూహంతో బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు.
గతంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీకి లేని రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకోవాలన్న దుగ్ధతో ఏకంగా ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమై, అడ్డంగా దొరికిపోయిన చరిత్ర చంద్రబాబుది. ఇంతే కాదు.. గతంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకున్నారన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. తన వర్గానికి లేదా ఆర్థికంగా మేలు చేసే వారికే సీట్లు ఇచ్చేవారన్న విమర్శలు టీడీపీలోనే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలకు ఒక్క అవకాశం కూడా ఉండేది కాదు. ఏపీలోనూ ఓ రాజ్యసభ స్థానాన్ని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు ఇచ్చినట్టే ఇచ్చి, చివర్లో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టారు.
నామినేషన్ వేయడానికి వెళ్తున్న వర్ల రామయ్యను అవమానకరంగా మధ్య దారిలోనే వెనక్కి పంపించి మరీ తన వాడికి ఇచ్చుకొన్నారు. ఈసారి కూడా టీడీపీ తరపున రాజ్యసభ స్థానానికి ఓ అభ్యర్థిని నిలబెట్టి, ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆయన కుయుక్తులు ఫలించకపోవడంతో చివరి నిమిషంలో తమ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. దీంతో రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరాయి.
2019 ఎన్నికల్లోనే టీడీపీ చరిత్రలో ఘోర పరాజయం
చంద్రబాబు మోసపూరిత విధానాలతో తెలుగుదేశం బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. రైతులు, మహిళల రుణాలు మంజూరు చేస్తామంటూ వారిని ఘోరంగా వంచించారు. ఉద్యోగాలివ్వకుండా యువతకు మొండిచేయి చూపారు. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వంటి పలు కుంభకోణాల్లో వందల కోట్ల దోపిడీ జరిగింది. ఇసుక, మద్యంలో టీడీపీ నేతల దందా చెప్పలేనంత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేసిన ఘనతా చంద్రబాబుదే.
ఇలా పెత్తందారీ పోకడలు, మోసపూరిత విధానాలు, దోపిడీతో రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు. చంద్రబాబు అసలు స్వరూపం మరోసారి బయటపడటంతో 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. దీంతో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించింది.
దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖాలాలు లేవు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు చతికిలపడింది. టీడీపీ చరిత్రలో ఘోర పరాజయం ఇదే. దీంతో రాజ్యసభలోని అన్ని స్థానాలూ వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి.
సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. మేనిఫెస్టో అంటే ఓ భగవద్గీత, ఓ బైబిల్, ఓ ఖురాన్ అని భావించే సీఎం జగన్.. ఆచరణలోనూ దానిని నిరూపించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలు నెరవేర్చారు.
ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్లు.. మొత్తం రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేదల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు.
పింఛను కోసం పేదలు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో పడిగాపులు గాయాల్సిన పని లేకుండా వారున్న చోటనే ఇస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు అండదండలందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలు
సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సీఎం జగన్ తెచ్చిన మార్పు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది. ఇది 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలు సాధించడానికి బాటలు వేసింది. రాష్ట్రంలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 10,299 పంచాయతీల్లో (80 శాతం) వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్, నగర పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో 52.63 శాతం ఓట్లతో 84 మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులను (97 శాతం) వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 14 కార్పొరేషన్ మేయర్ పదవులు (వంద శాతం) కైవసం చేసుకుంది.
మండల పరిషత్ ఎన్నికల్లో 65.22 శాతం ఓట్లతో 8,216 ఎంపీటీసీ స్థానాల్లో(88 శాతం) విజయం సాధించి, 637 మండల పరిషత్ అధ్యక్ష పదవులను (96 శాతం) వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 69.25 శాతం ఓట్లతో 630 జెడ్పీటీసీ(87 శాతం) స్థానాలను.. 13 జిల్లా పరిషత్ అ«ధ్యక్ష పదవులను (వంద శాతం) వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత భారీగా విజయం సాధించిన దాఖలాలు దేశ చరిత్రలో మరే పార్టీకీ లేవు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రక అపజయాలను మూటగట్టుకుంది.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి, బద్వేలు, ఆత్మకూరు శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఉండటంతో ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 2019లోకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభవం తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment