మధ్యాహ్న భోజనంలో ‘గుడ్ల’గూబలు! | TDP Massive corruption also in Distribution of eggs to Anganwadi Students | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో ‘గుడ్ల’గూబలు!

Published Tue, Sep 4 2018 3:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

TDP Massive corruption also in Distribution of eggs to Anganwadi Students - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ చిన్నారులు, సర్కారీ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన కోడిగుడ్ల పంపిణీలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జిల్లాల వారీగా ఉన్న కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు టెండర్లను రాష్ట్రస్థాయిలోకి మార్చి రూ.120 కోట్లకు పైగా గుటుక్కుమనిపించారు. పలుచోట్ల అధికార పార్టీ నేతలే కోడిగుడ్ల పంపిణీని సబ్‌ కాంట్రాక్టుగా దక్కించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. గతేడాది కోడిగుడ్ల సరఫరాలో లోపాలపై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యం. 

గుడ్డు రూ.3 ఉన్నా రూ.4.68 పైసలు
గతంలో పాఠశాల విద్యాశాఖ, స్త్రీ శిశుసంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించేవారు. గత ఏడాది వరకు పిల్లలకు వారానికి 3 కోడిగుడ్లు చొప్పున అందించగా ఈ ఏడాది ఐదుకి పెంచారు. వారానికి మూడుసార్లు చొప్పున రాష్ట్రంలో పిల్లలకు 1.80 కోట్ల గుడ్లు సరఫరా కావాలి. అయితే అప్పుడు మార్కెట్లో గుడ్డు రిటైల్‌ ధర రూ.3 మాత్రమే ఉన్నా రూ.4.68గా ఫిక్స్‌డ్‌ ధరను నిర్ణయించడం గమనార్హం.  వాస్తవానికి కోడిగుడ్ల ధరలు రోజువారీ మారుతూ ఉంటాయి. మార్పులకు తగ్గట్టుగా కాకుండా ఫిక్స్‌డ్‌ ధరలు నిర్ణయించి అక్రమాలకు తెరతీశారు. మరోవైపు హోల్‌సేల్‌లో కొటే రేటు భారీగా తగ్గుతుంది.

గుడ్డు ధర మార్కెట్లో రిటైల్‌గా రూ.5 నుంచి 6 వరకు ఉన్నప్పుడే హోల్‌సేల్‌లో రూ.4గా ఉంది. కానీ మార్కెట్‌ రేటుకన్నా ఎక్కువకు కాంట్రాక్టును రాష్ట్రంలో ముగ్గురికి అప్పగించారు. వీరెవరికీ గతంలో కోడిగుడ్ల పంపిణీలో అనుభవం కానీ, వ్యాపారంతో సంబంధం కానీ లేదు. ఏడాదిలో  (విద్యా సంవత్సరంలో సెలవులుపోను మిగిలిన 10 నెలలకు) 72 కోట్ల గుడ్లు సరఫరా చేయాలన్నది కాంట్రాక్టు. ఒక్కో కోడిగుడ్డుపై రిటైల్‌ మార్కెట్‌ ధరకన్నా రూ.1.68 ఎక్కువగా ధర నిర్ణయించడంతో ప్రభుత్వ ఖజానానుంచి రూ.120 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ సొమ్ము కాంట్రాక్టర్ల ద్వారా పెద్దలకు చేరింది. ఈ ఏడాది కోడిగుడ్ల సంఖ్యను 5కి పెంచి ఇదే కాంట్రాక్టర్లకు మళ్లీ సరఫరా బాధ్యత అప్పగించారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా మరో 40 శాతం గుడ్లు అంటే 120 కోట్ల కోడిగుడ్లను అందించాల్సి ఉంటుంది. అదే రేటుకు కట్టబెట్టడంతో చెల్లింపులు కూడా అదనంగా చేయాల్సి రావడంతో ఖజానాపై మరింత భారం పడనుంది.

గుడ్లు తగ్గిన పాతవారికే కాంట్రాక్టు
రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో గత ఏడాది జూన్‌ వరకు విద్యార్థులకు 49,12,15,382 గుడ్లు సరఫరా కావాల్సి ఉండగా 37,06,81,037 గుడ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 12,05,34,345 గుడ్లు సరఫరా కాలేదు. ఇక పాఠశాలలకు సంబంధించి కూడా వారానికి 3 గుడ్ల చొప్పున 52 కోట్ల గుడ్లు సరఫరా కావలసి ఉండగా 30 శాతం గుడ్లు కూడా సరఫరా కాలేదని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ పరిశీలనలో తేలింది. ఈ ఏడాది నుంచి వారానికి 5 గుడ్లు అందించాలని నిర్ణయించడంతో పాఠశాలలకు 70 కోట్ల గుడ్లు, అంగన్‌వాడీలకు 50 కోట్ల గుడ్లు మొత్తంగా 120 కోట్ల గుడ్లు సరఫరా కావాలి. గత ఏడాది గుడ్ల సరఫరాలో 30 శాతం వరకు కోతపడినా ప్రభుత్వం తిరిగి పాతవారికే ఈ కాంట్రాక్టును ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలే సబ్‌ కాంట్రాక్టులు తీసుకొని పిల్లల సొమ్ము మింగేస్తుండడంతో ప్రభుత్వం మౌనం దాలుస్తోంది.

తక్కువ బరువు గుడ్లు సరఫరా
కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా కలర్‌ కోడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా ఫలితం లేదు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లను బయట మార్కెట్లో  విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల పాడైన గుడ్లను సరఫరా చేసి జేబులు నింపుకొంటున్నారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ చట్టం ప్రకారం విద్యార్ధులకు 45 నుంచి 52 గ్రాముల బరువుండే గుడ్లు అందించాలి. కానీ పిల్లలకు అందించే గుడ్ల బరువు 30 గ్రాముల లోపే ఉంటోంది. మరీ చిన్నవిగా 20 గ్రాముల బరువు ఉండే గుడ్లు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల దారుణంగా ట్రే బరువును కలిపేసి గుడ్లు బరువుగా చూపిస్తున్నారు. గత ఏడాది దాదాపు ఆరేడు నెలల పాటు 60 నుంచి 65 శాతం మాత్రమే గుడ్లు పంపిణీ అయినట్లు ఏపీ ఫుడ్‌కమిషన్‌ పరిశీలనలో తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement