సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దు అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర...ఇంతవరకు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలక మండలి నుంచి ఆయనను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి కూడా. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మరోవైపు తెలంగాణ అసెంబ్లీ విస్తరణ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కనుక కారెక్కితే ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో బెర్త్ దక్కకున్నా... కీలక పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment