కేంద్రంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: 'మన దేశంలో ఎన్నికల నిర్వహణ వట్టి దండగ.. చట్ట సభలు వృథా.. ఈ ప్రజాస్వామ్య పద్ధతి మారాలి..' అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో 'ఆప్' దెబ్బకు బీజేపీ ఊడ్చుకు పోయిందంటూ ఘాటుగా విమర్శించారు. అనంతపురంలో తన స్వగృహంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తమలాంటి వారి సలహాలు పట్టించుకోకపోవటం వల్లనే ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన దృష్టిలో చట్ట సభలన్నీ వృథాగా మారిపోయాయని మండిపడ్డారు. కేంద్రం తమ మాట వినకపోతే ఇక ఎంపీ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానం రావాలని ఆయన అన్నారు.
ఎన్నికల నిర్వహణ కారణంగా అయిదేళ్లకోసారి కొన్ని వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని చెప్పారు. తామంతా వృథా అంటూ ఆయన.. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబును పొగిడారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన దారిలో నడిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
కాంగ్రెస్పై..
అనంతరం జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్‌పై దాడికి దిగారు. ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే రాహుల్, సోనియా, ప్రియాంక తదితరులు వెంటనే తప్పుకోవాలని సూచించారు. వీరు అసలైన గాంధీలు కాదని విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండాల్సిందని, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బును మిగుల్చుకునేందుకే ఆ పార్టీ నేతలు పోటీలోకి దింపారని ఆరోపించారు.